Mukesh Ambani Salary | ఆరేళ్లుగా వేతనమే లేదు.. అయినా ప్రపంచ కుబేరుల్లో 21వ స్థానం..

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Mukesh Ambani Salary | దిగ్గజ పారిశ్రామికవేత్త, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముకేశ్ అంబానీ వేతనం ఎంతో తెలుసా? సున్నా. ఆయన ఆరేళ్లుగా అసలు వేతనమే తీసుకోవడం లేదు. అయినా ప్రపంచ కుబేరుల్లో 21వ స్థానంలో ఉన్నారు. అదేలా సాధ్యమవుతుందో తెలుసుకుందామా..

ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) వార్షిక సర్వసభ్య సమావేశం జూన్ 19న జరగనుంది. సంస్థ ఎదుర్కొంటున్న సవాళ్లు, లాభాలు, భవిష్యత్తు ప్రణాళికలు, ఆవిష్కరణలకు సంబంధించి పలు కీలక విషయాలు వెల్లడించనున్నారు. రిలయన్స్ జియో ఐపీవోపైనా స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. ఇటీవలే రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక నివేదిక సైతం విడుదలయ్యింది. ముకేశ్ అంబానీ, ఆయన కుటుంబసభ్యుల జీతాలు, డివిడెండ్లు వంటి వాటి గురించి ఈ నివేదిక ప్రస్తావించింది. ఆసియా కుబేరుల్లో రెండో స్థానంలో ఉన్న ముకేశ్ అంబానీ (Mukesh Ambani) ఆరేళ్లుగా ఒక్క రూపాయి కూడా వేతనం తీసుకోవడం లేదని ఆ నివేదిక వెల్లడించింది.

Mukesh Ambani Salary | కొవిడ్‌నుంచి జీరో వేతనం..

2020లో కొవిడ్-19 వ్యాప్తి ప్రారంభమయ్యాక ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. కొంతకాలం అన్ని కంపెనీలూ దీని ప్రభావానికి లోనయ్యాయి. ఆ సమయంలో తమ గ్రూపు వ్యాపారాలన్నీ తిరిగి పూర్తి స్థాయిలో ఆదాయాలు ఆర్జించేవరకు వేతనం తీసుకోనని ముకేశ్ అంబానీ ప్రకటించారు. వేతనం సహా ఇతర అలవెన్సులు, ఇన్సెంటివ్స్ కూడా వదులుకున్నారు. అప్పటినుంచి ఒక్క రూపాయి వేతనం కూడా తీసుకోవడం లేదు. కాగా ఆయన కొవిడ్‌కు ముందు 2019-20 ఆర్థిక సంవత్సరంలో వార్షిక పారితోషికం కింద రూ. 15 కోట్లు పొందేవారు.

Mukesh Ambani Salary | డివిడెండ్ రూ. 9.66 కోట్లు..

ముఖేశ్ అంబానీ ఒక్క రూపాయి కూడా వేతనం తీసుకోకున్నా ఆయన సంపద మాత్రం పెరిగింది. ఆయనకు రిలయన్స్ కంపెనీలో ఉన్న 1.61 కోట్ల షేర్లపై రూ. 9.66 కోట్లు డివిడెండ్ రూపంలో వచ్చాయి.

Mukesh Ambani Salary | మిగతావారి వేతనాల వివరాలు..

2025-26లో ముకేశ్ అంబానీ బంధువులు నిఖిల్, హితల్ మేస్వాని వార్షిక పారితోషికంలో ఎలాంటి మార్పు లేకుండా రూ. 25 కోట్లుగా కొనసాగింది.

ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పీఎంఎస్ ప్రసాద్ పారితోషికం 2024-25లో రూ. 19.96 కోట్లు ఉండగా.. అది గత ఆర్థిక సంవత్సరంలో రూ.20.58 కోట్లకు చేరింది.

రిలయన్స్ బోర్డులో డైరెక్టరైన ముకేశ్ కుమారుడు ఆకాశ్ అంబానీ, కూతురు రిలయన్స్ రిటైల్ బాధ్యతలు చూస్తున్న ఇషా అంబానీ పిరమల్‌లకు సిట్టింగ్ ఫీజుల కింద రూ. 5 లక్షలు, డివిడెండ్ రూపంలో రూ. 2.5 కోట్లు లభించాయి. వీరికి సమావేశాలు, బోర్డు మీటింగుల్లో పాల్గొన్నందుకు ఫీజు లభిస్తోంది.

గతేడాది రిలయన్స్ బోర్డులో ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా నియమితులైన ముఖేశ్ అంబానీ మరో కుమారుడు అనంత్ అంబానీ సిట్టింగ్ ఫీజులు, ఇతర అలవెన్స్‌లు, వేతనం రూపంలో రూ. 12.17 కోట్లు అందుకున్నారు.

బోర్డులోని స్వతంత్ర డైరెక్టర్ల డివిడెండ్ రూ. 2.25 కోట్ల నుంచి రూ. 2.5 కోట్లకు పెరిగింది. దీనికి సిట్టింగ్ రుసుము అదనం.
రిలయన్స్ బోర్డులో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా ఎస్‌బీఐ మాజీ చైర్‌పర్సన్ అరుంధతి భట్టాచార్య, మాజీ సీవీసీ కేవీ చౌదరి, కేవీ కామత్ లాంటి ప్రముఖులున్నారు.

ఇది కూడా చదవండి..: Hamirpur Bridge Collapse | కూలిన భారీ వంతెన.. ఆరుగురు కార్మికుల మృతి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *