అక్షరటుడే వెబ్‌డెస్క్: NEET UG Leak | దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన నీట్-యూజీ (NEET-UG) ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ ఉదంతంలో జరిగిన లోపాలకు పూర్తి జవాబుదారీతనం ఉండాల్సిందేనని శుక్రవారం (మే 29, 2026) అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. పరీక్షల లీకేజీ వంటి ఘటనలు దేశ యువతను, వారి కుటుంబాలను తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తాయని ఆవేదన వ్యక్తం చేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) స్థానంలో మరో పటిష్టమైన, స్వయంప్రతిపత్తి గల సంస్థను ఏర్పాటు చేయాలని లేదా ఎన్టీఏను పూర్తిగా పునర్నిర్మించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ అలోక్ అరధేలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా “మనం మన యువతను నిరాశపరచకూడదు” అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
NEET UG Leak | కుటుంబాలు ఎంతో భావోద్వేగంతో ఉంటాయి..
ఈ లీకేజీల వల్ల విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా తీవ్రంగా నష్టపోతున్నారని కోర్టు పేర్కొంది. “ఇలాంటి అక్రమాలు జరిగినప్పుడు అది కేవలం విద్యార్థులకే కాదు, వారి కుటుంబాలకు కూడా నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే వారు ఈ పరీక్షలపై ఎన్నో ఆశలు, ఎంతో భావోద్వేగాన్ని పెట్టుకుంటారు” అని బెంచ్ అభిప్రాయపడింది. వ్యవస్థలో ఖచ్చితమైన జవాబుదారీతనం వచ్చే వరకు అసలు సమస్యకు పరిష్కారం లభించదని కోర్టు తేల్చి చెప్పింది.

NEET UG Leak | పర్యవేక్షిస్తున్న ప్రధాని మోదీ..
ప్రభుత్వం తరఫున కోర్టుకు హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ.. విద్యార్థుల, యువత ఆందోళనల పట్ల కేంద్ర ప్రభుత్వం అత్యంత తీవ్రంగా శ్రద్ధ వహిస్తోందని చెప్పారు. ఎలాంటి లోపాలు జరగకుండా ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఈ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని ధర్మాసనానికి వివరించారు. అలాగే రాబోయే జూన్ 21న జరగనున్న నీట్-యూజీ పునఃపరీక్ష (Re-test) కోసం పటిష్టమైన కొత్త భద్రతా చర్యలను, సరికొత్త యంత్రాంగాన్ని సిద్ధం చేసినట్లు కోర్టుకు తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర వివరాలతో కూడిన అఫిడవిట్‌ను దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను జూలై రెండవ వారానికి వాయిదా వేసింది.

NEET UG Leak | నేపథ్యం..
మే 3న నిర్వహించిన నీట్-యూజీ పరీక్ష ప్రశ్నపత్రం లీకైందన్న బలమైన ఆరోపణల నేపథ్యంలో, మే 12న జాతీయ విద్యా మంత్రిత్వ శాఖ ఆ పరీక్షను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ లీకేజీ వ్యవహారంపై సీబీఐ (CBI) ముమ్మర దర్యాప్తు జరుపుతోంది. ఈ క్రమంలోనే జూన్ 21న దేశవ్యాప్తంగా రీ-టెస్ట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఇది కూడా చదవండి: Drunk Drive Karimnagar | నేను మందు తాగాను.. జైలుకైనా వెళ్తా.. అంటూ పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబు


