అక్షరటుడే వెబ్‌డెస్క్: US Green Card | అమెరికా గ్రీన్‌కార్డు దరఖాస్తుదారులకు సంబంధించి ఇటీవల నెలకొన్న గందరగోళంపై యూఎస్ హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (DHS) కీలక స్పష్టతనిచ్చింది. శాశ్వత నివాసం (గ్రీన్‌కార్డు) కోసం దరఖాస్తు చేసుకున్న వలసదారులు, ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు అమెరికా విడిచి వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. తాత్కాలిక వీసాలపై ఉన్న వలసదారుల్లో ఆందోళన రేకెత్తించిన ఒక నోటిఫికేషన్ వచ్చిన కొద్ది రోజులకే ప్రభుత్వం ఈ వివరణ ఇవ్వడం గమనార్హం. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం ఈ వివరాలు వెల్లడయ్యాయి.
US Green Card | ఆందోళన కలిగించిన వలస సేవల ప్రకటన..
అసలు ఈ వివాదమంతా యూఎస్ పౌరసత్వం , వలస సేవల (USCIS) విభాగం చేసిన ఒక ప్రకటనతో మొదలైంది. గ్రీన్‌కార్డు కోరుకునే వారు “అసాధారణ” మినహాయింపులు ఉంటే తప్ప, సాధారణంగా తమ స్వదేశాలకు వెళ్లిపోయి అక్కడే వేచి ఉండాలని అందులో పేర్కొంది. దీనిని వలస చట్టాల్లో తీసుకొచ్చిన ఒక పెద్ద విధానపరమైన మార్పుగా వలసదారులు భావించారు. తమను ఎక్కడ దేశం దాటమంటారోనని తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

US Green Card | పాత నిబంధనలే అమలు..
ఈ వివాదంపై శుక్రవారం స్పందించిన హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (DHS).. నిబంధనల్లో ఎలాంటి సమూల మార్పులూ చేయలేదని స్పష్టం చేసింది. దరఖాస్తుదారులు అమెరికాలోనే ఉండాలా లేదా దేశం వెలుపలికి వెళ్లాలా అనేది వలస అధికారులు వారి వ్యక్తిగత కేసులను బట్టి చాలా కాలంగా నిర్ణయిస్తున్నారని, ఇప్పుడు కూడా అదే పద్ధతి కొనసాగుతుందని తెలిపింది. ఇటీవలి మార్గదర్శకాలు కేవలం అధికారులకు ఉన్న పాత విచక్షణాధికారాలను గుర్తు చేయడానికి ఉద్దేశించినవేనని ఓ ప్రతినిధి వివరించారు.

US Green Card | నిబంధనలు పాటిస్తే అమెరికాలోనే ఉండొచ్చు..
అత్యధిక శాతం మంది వలసదారులు వారి దరఖాస్తులు పరిశీలనలో ఉన్నంత కాలం అమెరికాలోనే ఉండేందుకు అనుమతి ఉంటుందని అధికారులు భరోసా ఇచ్చారు. అయితే వీసా గడువు ముగిసినా దేశంలోనే ఉండిపోవడం లేదా ఇతర వలస చట్టాలను ఉల్లంఘించిన వారి విషయంలో మాత్రం అధికారులు వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకుంటారు. ఎవరిని విదేశాలకు పంపించవచ్చనే దానిపై ఇంకా పూర్తిస్థాయి ప్రమాణాలను విడుదల చేయనప్పటికీ, ప్రస్తుతానికైతే గ్రీన్‌కార్డు దరఖాస్తుదారులు ఎలాంటి ఆందోళన లేకుండా అమెరికాలోనే నివసించవచ్చని స్పష్టమైంది.
ఇది కూడా చదవండి: Balka Suman Arrest | తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత.. బాల్క సుమన్‌ను అరెస్ట్ చేస్తారా!


