అక్షరటుడే, వెబ్‌డెస్క్ : GST Collections May | దేశంలోని వస్తు, సేవల పన్ను వసూళ్లు మే నెలలో స్థిరమైన వృద్ధిని నమోదు చేశాయి. దేశవ్యాప్తంగా స్థూల జీఎస్టీ వసూళ్లు రూ. 1,94,184 కోట్లకు చేరుకున్నాయి. గతేడాది ఇదే కాలంలో పోల్చి చూస్తే ఈసారి పన్ను వసూళ్లు 3.2 శాతం పెరిగాయి. మే 2025లో స్థూల జీఎస్టీ వసూళ్లు రూ. 1,88,172 కోట్లుగా ఉన్నాయి.
మే 2026లో స్థూల జీఎస్టీ (GST) రూ. 1.94 లక్షల కోట్లు కాగా.. రిఫండ్ల సర్దుబాటు అనంతరం నికర ఆదాయం రూ. 1,66,904 కోట్లని కేంద్ర ఆర్థిక శాఖ చెబుతోంది. ఈ నికర ఆదాయాల పెరుగుదల దేశీయంగా వ్యాపార లావాదేవీలు స్థిరంగా సాగుతున్నాయనడానికి స్పష్టమైన సంకేతంగా నిలుస్తోంది.
GST Collections May | పెరిగిన రీఫండ్లు..
రీఫండ్లు గతేడాదితో పోల్చితే 2.6 శాతం పెరిగి రూ. 27,281 కోట్లుగా నమోదయ్యాయి. అయితే దేశీయ రీఫండ్లు 4.3 శాతం తగ్గగా.. ఎగుమతి ఆధారిత రీఫండ్లు 16.6 శాతం పెరిగాయి. గతేడాదితో పోలిస్తే స్థూల దేశీయ జీఎస్టీ రాబడి 2.6 శాతం తగ్గింది. ఈ మొత్తం రూ.1.34 లక్షల కోట్లు. ఇదే సమయంలో దిగుమతులపై వసూళ్లు 19.1 శాతం పెరిగి, రూ.59,654 కోట్లకు చేరాయి.
GST Collections May | ఏప్రిల్ లో ఆల్ టైం హై..
ఏప్రిల్ 2026లో రూ. 2,42,702 కోట్లతో జీఎస్టీ వసూళ్లు ఆల్ టైం హైని తాకాయి. సాధారణంగా మార్చి నెల ముగింపు (ఆర్థిక సంవత్సరాంతం) తర్వాతి నెల అయిన ఏప్రిల్‌లో పన్ను వసూళ్లు గణనీయంగా పెరుగుతాయి. ఆ రికార్డు స్థాయి వసూళ్ల తర్వాత మే నెలలో రూ. 1.94 లక్షల కోట్లు రావడం ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని ప్రతిబింబిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) ప్రారంభ త్రైమాసిక ప్రగతిని పరిశీలిస్తే.. మొదటి రెండు నెలల్లో కలిపి దేశవ్యాప్తంగా పన్ను వసూళ్లు 6.2 శాతం వృద్ధితో ఏకంగా రూ. 4.37 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఆర్థిక సంవత్సరం ఆరంభంలోనే ఈ స్థాయి వసూళ్లు నమోదు కావడం ప్రభుత్వానికి పెద్ద ఊరటనిచ్చే విషయం.
ఇది కూడా చదవండి..: Rajya Sabha Elections | 24 రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల..


