Telangana Employee Transfers | తెలంగాణలో ఉద్యోగుల బదిలీలపై కఠిన ఆంక్షలు.. రూల్స్ బ్రేక్ చేస్తే జీతం కట్

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Telangana Employee Transfers | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 1వ తేదీ నుండి అమలులోకి వచ్చేలా ఉద్యోగుల అన్ని రకాల బదిలీలపై పూర్తిస్థాయి నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా సోమవారం జీవో జారీ చేసారు. గతనెల మే 1 నుండి మే 31 వరకు బదిలీలకు ఇచ్చిన తాత్కాలిక సడలింపు గడువు ముగియడంతో, జూన్ 1 నుంచి తదుపరి ఆరు నెలల కాలం పాటు బదిలీలపై ఎలాంటి మినహాయింపు ప్రతిపాదనలను కూడా స్వీకరించబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది.

tg

Telangana Employee Transfers | ఈ సందర్భాలలో మాత్రమే ..

ప్రభుత్వం బదిలీలపై సమగ్ర నిషేధం విధించినప్పటికీ, కొన్ని నిర్దిష్టమైన అత్యవసర పరిస్థితులకు మాత్రం ఆర్థిక శాఖ అనుమతి అవసరం లేకుండానే నియామక ఉత్తర్వులు జారీ చేసేందుకు సంబంధిత అథారిటీకి చాన్స్ ఇచ్చింది. ఆ మినహాయింపులు ఇవే:

ఉద్యోగులకు ప్రమోషన్లు లభించినప్పుడు, ఇతర ఉద్యోగులను బదిలీ చేయకుండా కేవలం ఖాళీగా ఉన్న సీట్లలోనే వారికి కొత్త పోస్టింగ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఉద్యోగ పోస్టులు రద్దయినా, పాత పదవుల్లోకి మార్చినా, తిరిగి సొంత శాఖలకు లేదా డెప్యుటేషన్‌పై ఇతర విభాగాలకు పంపినా, క్రమశిక్షణా చర్యల వల్ల పోస్టింగులు ఇవ్వాల్సి వచ్చినా… వాటిని కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్పష్టమైన ఖాళీల్లోనే భర్తీ చేయాలి. దీనితో పాటు ఆరు నెలల కంటే ఎక్కువ కాలం సుదీర్ఘ సెలవులో ఉండి, తిరిగి విధుల్లో చేరే ఉద్యోగులకు సైతం ఖాళీగా ఉన్న స్థానాల్లోనే పోస్టింగ్ ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
transfer 1

Telangana Employee Transfers | నిబంధనలు ఉల్లంఘిస్తే జీతాల నిలిపివేత..

పరిపాలనా సామర్థ్యం కోసం ప్రస్తుతం ఉన్న ఖాళీలను భర్తీ చేయాల్సి వస్తే, ప్రస్తుత స్థానంలో కనీసం ఏడాది పాటు చురుకైన సేవలు పూర్తి చేసుకున్న వారిని మాత్రమే తగిన కారణాలతో ఆర్థిక శాఖ ముందస్తు అనుమతితో నియమించాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ నిబంధనలను ఉల్లంఘించి ఎవరినైనా బదిలీ చేస్తే, సదరు ఉద్యోగుల జీతాల బిల్లులను ఆమోదించవద్దని ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డైరెక్టర్, పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్‌లను ప్రభుత్వం ఆదేశించింది. సెక్రటేరియట్ విభాగాలతో పాటు అన్ని శాఖల అధిపతులు, జిల్లా కలెక్టర్లు ఈ ఉత్తర్వులను ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి: Kavitha Telangana Warning | ఆంధ్రా నేతల విగ్రహాలు పగలగొట్టి పార్సల్ చేస్తాం.. కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *