అక్షరటుడే వెబ్‌డెస్క్: Sugar Stock Rules | దేశంలో చక్కెర ధరలు పెరగకుండా, కృత్రిమ కొరత లేదా బ్లాక్ మార్కెటింగ్‌కు తావులేకుండా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని వ్యాపారులకు సంబంధించిన స్టాక్ హోల్డింగ్ నిబంధనలను మరింత కఠినతరం చేసింది. అక్టోబర్ 15, 2026 నుంచి నవంబర్ 30, 2026 వరకు ఈ కొత్త నిబంధనలు అమల్లో ఉండనున్నాయి.
Sugar Stock Rules | కొత్త నిబంధనలు..
సాధారణ ప్రాంతాల్లోని చక్కెర డీలర్లు ఒకేసారి గరిష్ఠంగా 1,000 క్వింటాళ్ల స్టాక్‌ను మాత్రమే నిల్వ ఉంచుకోవాలి. డీలర్‌కు చక్కెర నిల్వ చేరిన తేదీ నుంచి 15 రోజుల్లోపు ఆ స్టాక్‌ను మార్కెట్‌లోకి విడుదల చేయాలి. అంటే 15 రోజులకు మించి నిల్వ ఉంచడానికి వీలులేదు. కొన్ని ప్రాంతాల ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మినహాయింపునిచ్చారు. కోల్‌కతా, దాని చుట్టుపక్కల మెట్రోపాలిటన్ ప్రాంతాలు, అస్సాంలో ( Assam ) మాత్రం డీలర్లు 2,000 క్వింటాళ్ల వరకు నిల్వ చేసుకోవడానికి అనుమతించారు.
Sugar Stock Rules | ప్రభుత్వ హెచ్చరిక..
గతంతో పోలిస్తే చక్కెర ధరలు కొంతమేర దిగివచ్చాయి. ఆగస్టు గరిష్ఠ స్థాయి నుంచి సగటు రిటైల్ ధర సుమారు 15 శాతం తగ్గగా, ఎక్స్-మిల్ ధరలు దాదాపు 28 శాతం తగ్గాయి. గత మూడు వారాలుగా ఎక్స్-మిల్ ధరలు స్థిరంగా ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ ధర తగ్గుదల ప్రయోజనం సామాన్య వినియోగదారులకు పూర్తిగా అందేలా టోకు, చిల్లర వ్యాపారులు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
అలాగే అక్టోబర్ 1 నుంచి కొత్త చక్కెర సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో.. వాతావరణ పరిస్థితులు, చెరకు దిగుబడులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రైతులు, వినియోగదారులు, పరిశ్రమల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మార్కెట్లో నిరంతరం చక్కెర అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది.
ఇది కూడా చదావండి: KLU Library Fire | కేఎల్ యూనివర్సిటీలో భారీ అగ్నిప్రమాదం