అక్షరటుడే వెబ్‌డెస్క్: Putin Europe Conflict | యూరప్ దేశాలపై రష్యా ( Russia ) దాడికి సిద్ధమవుతోందన్న ప్రచారాన్ని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గట్టిగా తిప్పికొట్టారు. యూరప్‌తో ఎలాంటి రకమైన యుద్ధానికి తాము సిద్ధం కావడం లేదని స్పష్టం చేశారు. శుక్రవారం సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. యూరప్ దేశాలతో ఉద్రిక్తతలను పెంచుకోవాల్సిన అవసరం రష్యాకు ఏమాత్రం లేదన్నారు. రష్యా విస్తృత స్థాయి ఘర్షణకు దిగుతోందంటూ కొందరు నాటో సభ్య దేశాలు చేస్తున్న హెచ్చరికలను ఆయన పూర్తిగా ఖండించారు.
Putin Europe Conflict | నాటో దేశాల ఆరోపణలు ..
ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో.. రష్యా నేరుగా నాటో దేశాలతో ఘర్షణకు దిగాలని చూస్తోందని, డ్రోన్ కార్యకలాపాలు, విధ్వంసక చర్యలకు పాల్పడుతోందని పలు యూరప్ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నెల ప్రారంభంలో జర్మనీ.. ఆగస్టులో లైప్జిగ్ విమానాశ్రయంపై డ్రోన్ దాడికి రష్యా ప్రణాళిక వేసిందని ఆరోపించింది. ఉక్రెయిన్‌కు మద్దతు ఇస్తున్న దేశాలపై రష్యా డ్రోన్లు, క్షిపణులతో దాడి చేసే అవకాశం ఉందని పోలాండ్ కూడా హెచ్చరించింది.
అయితే ఈ ఆరోపణలన్నింటినీ క్రెమ్లిన్ ఎప్పటికప్పుడు తోసిపుచ్చుతూనే ఉంది. నాటో దేశాల్లో ఎలాంటి హైబ్రిడ్ ఆపరేషన్లకు పాల్పడటం లేదని, ఆ దేశాలతో నేరుగా తలపడే ఉద్దేశం తమకు లేదని మాస్కో స్పష్టం చేసింది.
Putin Europe Conflict | ఉక్రెయిన్‌తో శాంతి చర్చలపై ..
ఇదే సమావేశంలో ఉక్రెయిన్‌తో శాంతి చర్చలను తిరిగి ప్రారంభించే అంశంపై కూడా పుతిన్ మాట్లాడారు. చర్చలను పునఃప్రారంభించేందుకు వచ్చిన ప్రతిపాదనలు ఇంకా తమ టేబుల్‌పైనే ఉన్నాయని తెలిపారు. అయితే, ఇటీవల ఉక్రెయిన్ తమ భూభాగంపై దాడులకు పాల్పడిందని రష్యా ఆరోపిస్తున్న నేపథ్యంలో.. వాటిపై తమ స్పందనను నిర్ణయించిన తర్వాతే తదుపరి చర్యలపై అడుగులు వేయాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. పుతిన్ వ్యాఖ్యలను బట్టి చూస్తే.. ఉక్రెయిన్‌తో చర్చలకు రష్యా పూర్తిగా తలుపులు మూసివేయలేదని, సరైన సమయం కోసం చూస్తోందని స్పష్టమవుతోంది.
ఇది కూడా చదవండి: Godavari Pushkar Works | గోదావరి పుష్కర పనులకు అత్యంత ప్రాధాన్యత: కలెక్టర్ భవేష్ మిశ్రా