అక్షరటుడే వెబ్‌డెస్క్: Trump Iran Peace Plan | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ శాంతి ప్రతిపాదనకు షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాల్పుల విరమణ కోసం టెహ్రాన్ ముందుకు తెచ్చిన ప్రణాళికను ట్రంప్ తిరస్కరించినట్లు అమెరికా మీడియా కథనాలు వెల్లడించాయి. నవంబర్‌లో అమెరికాలో మధ్యంతర ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఆ ఎన్నికల తర్వాత ఇరాన్‌పై మళ్లీ దాడులు చేసేందుకు ట్రంప్ సన్నద్ధమవుతున్నట్లు సమాచారం.
Trump Iran Peace Plan | ఒప్పందానికి ఇరాన్ షరతులు..
తమ దేశ ఓడరేవులపై అమెరికా విధించిన దిగ్బంధనాన్ని ఎత్తివేస్తే.. అందుకు ప్రతిగా హర్మూజ్ జలసంధిని మళ్లీ తెరుస్తామని, అణుచర్చలను పునరుద్ధరిస్తామని ఇరాన్ ప్రతిపాదించింది. ఖతార్ మధ్యవర్తుల ద్వారా ఈ శాంతి ప్రణాళికను అమెరికాకు చేరవేశామని, ఈ ఒప్పందం కుదిరితే కేవలం ఏడు రోజుల్లోనే హర్మూజ్ జలసంధిని తెరుస్తామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి ఇదివరకే పేర్కొన్నారు.
అయితే, ఇరాన్ తెచ్చిన ఈ శాంతి ప్రణాళికపై ట్రంప్ ఎలాంటి సానుకూలత వ్యక్తం చేయలేదని తెలుస్తోంది. టెహ్రాన్ ఈ శాంతి ఒప్పందానికి నిజంగానే కట్టుబడి ఉంటుందా? లేదా? అనే అంశంపై అమెరికా అధ్యక్షుడికి అనేక అనుమానాలు ఉన్నట్లు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
Trump Iran Peace Plan | ‘ట్రంప్ జలసంధి’గా పేరు మార్పు..
మరోవైపు, హర్మూజ్ జలసంధిపై ( Hormuz Strait ) పూర్తి నియంత్రణ తమదేనని ట్రంప్ తరచూ వాదిస్తూ వస్తున్నారు. తాజాగా ఈ అంశంపై మరింత దూకుడుగా వ్యవహరిస్తూ తన ‘ట్రూత్ సోషల్’ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. హర్మూజ్ జలసంధి పేరును మార్చి ‘ట్రంప్ జలసంధి’ (Trump Strait) అని రాసి ఉన్న ఒక మ్యాప్ ఫోటోను ఆయన షేర్ చేశారు.
ప్రస్తుతం హర్మూజ్ జలసంధిలో అమెరికా దిగ్బంధనంతో పాటు ఇరాన్ ఆంక్షలు కొనసాగుతుండటంతో నౌకల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. తమ ఆస్తులను విడుదల చేయాలని, చమురు ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేసి సైనిక చర్యలను నిలిపివేయాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. అప్పుడే హర్మూజ్‌లో స్వేచ్ఛా వాణిజ్యానికి అవకాశం ఉంటుందని స్పష్టం చేస్తోంది.
ఇది కూడా చదవండి: Godavari Pushkar Works | గోదావరి పుష్కర పనులకు అత్యంత ప్రాధాన్యత: కలెక్టర్ భవేష్ మిశ్రా