అక్షరటుడే, వెబ్డెస్క్ : Indiramma Houses | అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Ponguleti) అన్నారు. రాష్ట్రంలో ఒక్క పూరి గుడిసె ఉండకూడదనే లక్ష్యంతో సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు.
మంత్రి పొంగులేటి శనివారం జనగామ జిల్లాలో పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. మున్సిపాలిటీకి 16 ఆటోలు, జేసీబీ అందజేశారు. పలువురు మున్సిపల్ సిబ్బందికి నియామక పత్రం అందించారు. అనంతరం జనగామ (Jangaon) నియోజకవర్గ పరిధిలో పూరి గుడిసెల్లో నివసిస్తున్న 500 మంది పేదలకు ఇందిరమ్మ ఇండ్ల రెండో విడతలో భాగంగా మంజూరు పత్రాలు మంత్రి అందజేశారు. ఇల్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు వెంటవెంటనే బిల్లులు చెల్లిస్తున్నట్లు తెలిపారు.
Indiramma Houses | 15 రోజుల్లో బిల్లులు చెల్లిస్తాం
కేంద్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి రూ.72 వేలు ఇస్తామని చెప్పిందని మంత్రి తెలిపారు. అయితే చాలా రోజులుగా నిధులు విడుదల చేయాలని పేర్కొన్నారు. పదే పదే అడగటంతో ఇటీవల 2 లక్షల ఇళ్లకు రూ.72 వేల చొప్పున కేంద్రం విడుదల చేసిందన్నారు. కేంద్రం అందించే నిధుల జాప్యం లబ్ధిదారులకు భారం కాకుండా 45 వేల ఇండ్లకు చివరి బిల్లును రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జమ చేసిందని మంత్రి గుర్తు చేశారు. నిర్మాణం పూర్తయిన మిగిలిన 1 లక్ష 80 వేల ఇళ్లకు 15 రోజుల్లో బిల్లులు చెల్లిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దీనిని కూడా చదవండి : India Men’s Kabaddi | కబడ్డీలో మరో స్వర్ణం.. సత్తా చాటిన పురుషుల జట్టు