KTR Revanth Reddy | రేవంత్ రెడ్డి ‘నిజాయితీ గల మోసగాడు’.. కేటీఆర్ సంచలన విమర్శలు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: KTR Revanth Reddy | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఒక ‘నిజాయితీ గల మోసగాడు’ అని ప్రజలు నమ్ముతారని గతంలోనే చెప్పానని, ఇప్పుడు అదే నిజమవుతోందని అన్నారు. ప్రజలు పాలునిచ్చే ఆవును (బర్రెను) వదులుకుని, తన్నే దున్నపోతును తెచ్చుకున్నట్లు రాష్ట్ర ప్రజల పరిస్థితి తయారైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో శనివారం మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ శ్రేణులను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

KTR Revanth Reddy | రైతుబంధు ఎగ్గొట్టారు..

కేసీఆర్ హయాంలో రైతులు నాట్లు వేసే సమయానికే వారి ఖాతాల్లో నేరుగా రైతుబంధు డబ్బులు పడేవని కేటీఆర్ గుర్తుచేశారు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటివరకు మూడుసార్లు రైతుబంధును ఎగ్గొట్టిందని విమర్శించారు. కేవలం 100 రోజుల్లోనే ఆరు గ్యారెంటీలతో పాటు అన్ని హామీలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఒక్క హామీని కూడా పూర్తిగా నెరవేర్చలేదని మండిపడ్డారు. ఎవరు గెలిచినా కేసీఆరే సీఎం అవుతారని, సంక్షేమ పథకాలు నిలిచిపోవని ప్రజలు భావించారని.. కానీ ‘అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం ఊడినట్లు’ రాష్ట్ర ప్రజల పరిస్థితి మారిపోయిందని ఎద్దేవా చేశారు. మహబూబాబాద్‌లో కాంగ్రెస్‌కు ఓటేస్తే గెలిచిన నాయకుడు కనీసం జనాలకు కనిపించకుండా పోయాడని విమర్శించారు.

KTR Revanth Reddy | కేసీఆర్ ప్రజల తీర్పును గౌరవించారు..

ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ ప్రజల తీర్పును గౌరవించి కాంగ్రెస్‌కు కొంత సమయం ఇచ్చారని కేటీఆర్ తెలిపారు. మూడేళ్లు ఆయన ప్రజల ముందుకు రాకపోయినా, నేటికీ రాష్ట్రంలోని గల్లీ గల్లీలో కేసీఆర్ సంక్షేమ పథకాల పాటే వినిపిస్తున్నాయని చెప్పారు.

KTR Revanth Reddy | 2028లో బీఆర్ఎస్ అధికారంలోకి ..

రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయం పూర్తిగా మారబోతోందని కేటీఆర్ జోస్యం చెప్పారు. 2028 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం తథ్యమని పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ దోపిడీ, అవినీతి పాలనకు చరమగీతం పాడాల్సిన బాధ్యత పూర్తిగా ప్రజల చేతుల్లోనే ఉందన్నారు. సెప్టెంబర్ 28 నుంచి ప్రారంభమయ్యే పట్టభద్రుల (గ్రాడ్యుయేట్స్) ఓటరు నమోదు ప్రక్రియలో ప్రతి ఒక్కరూ పెద్దఎత్తున పాల్గొని, కాంగ్రెస్, బీజేపీల ప్రజా వ్యతిరేక వైఖరిని ఎండగట్టాలని ఆయన పిలుపునిచ్చారు.

ఇది కూడా చదవండి:  Godavari Pushkar Works | గోదావరి పుష్కర పనులకు అత్యంత ప్రాధాన్యత: కలెక్టర్ భవేష్ మిశ్రా

 

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *