అక్షరటుడే వెబ్‌డెస్క్: IoT Cyber Attacks | సైబర్ నేరగాళ్లు తమ దాడుల శైలిని మార్చుకుంటున్నారు. ఇప్పటివరకు కేవలం బ్యాంకింగ్ వ్యవస్థలు, కంప్యూటర్ డేటా, వ్యక్తిగత సమాచారం, ప్రభుత్వ వెబ్సైట్లను లక్ష్యంగా చేసుకున్న హ్యాకర్లు.. ఇప్పుడు ఏకంగా భౌతిక యంత్రాలపై దాడులకు దిగుతున్నారు. తాజాగా బెల్జియం, స్వీడన్ సహా పలు ఐరోపా ( Europe ) దేశాల్లోని సూపర్మార్కెట్ల రిఫ్రిజరేషన్ వ్యవస్థలను హ్యాక్ చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. ఫ్రీజర్ల ఉష్ణోగ్రతలను ఏకంగా 50 డిగ్రీల సెల్సియస్ దాటేలా మార్చడంతో టన్నుల కొద్దీ ఆహార పదార్థాలు నాశనమయ్యాయి. గతంలో అమెరికా సైనిక స్థావరాలు, ఫ్రాన్స్‌లోని సూపర్మార్కెట్లలోనూ ఇలాంటి ఘటనలు వెలుగులోకి రావడం గమనార్హం.
IoT Cyber Attacks | కొత్త తరహా సైబర్ ఉగ్రవాదం..
సాధారణంగా సైబర్ దాడి అంటే డేటా చోరీ లేదా ఆర్థిక నేరాలే అనుకుంటారు. కానీ ఇంటర్నెట్కు అనుసంధానమైన (IoT) యంత్రాలను కంట్రోల్ చేస్తూ భౌతికంగా నష్టం కలిగించే స్థాయికి హ్యాకర్లు చేరుకున్నారు. సూపర్‌మార్కెట్లలోని కూలింగ్ సిస్టమ్స్‌లోకి చొరబడి ఉష్ణోగ్రతలను మార్చడం వల్ల వ్యాపారులకు కోట్ల రూపాయల ఆర్థిక నష్టం వాటిల్లడమే కాకుండా, ప్రజల ఆహార సరఫరా వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉంది. నిత్యావసర ఆహార నిల్వలను టార్గెట్ చేస్తూ పాడుచేయడాన్ని నిపుణులు ఒక రకమైన సైబర్ ఉగ్రవాదంగా అభివర్ణిస్తున్నారు.
IoT Cyber Attacks | ముప్పు తప్పదా?
సాంకేతికత పెరిగిన కొద్దీ ఇళ్లలో వైఫై ఆధారిత స్మార్ట్ ఫ్రిజ్‌లు, ఏసీలు, వాషింగ్ మెషీన్లు, ఇతర పరికరాల వాడకం పెరిగింది. వీటిని స్మార్ట్‌ఫోన్ యాప్‌ల ద్వారా ఎక్కడి నుంచైనా ఆపరేట్ చేసే వెసులుబాటు ఉంది. అయితే తగినంత సైబర్ భద్రత లేకపోతే ఈ గృహోపకరణాలను కూడా హ్యాకర్లు తమ ఆధీనంలోకి తీసుకునే ప్రమాదం ఉందని హెచ్చరికలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం పెద్ద పెద్ద వాణిజ్య సంస్థల్లో కనిపిస్తున్న ఈ ముప్పు భవిష్యత్తులో సామాన్యుల ఇళ్లకు విస్తరించే అవకాశాలు లేకపోలేవు.
IoT Cyber Attacks | ఫార్మా రంగానికి పెద్ద సవాల్..
ఈ తరహా దాడులు సూపర్మార్కెట్లకు మాత్రమే పరిమితమైతే ఆర్థిక నష్టంతో సరిపెట్టుకోవచ్చు. కానీ వ్యాక్సిన్లు, అత్యవసర మందులు నిల్వ చేసే ఫార్మా కంపెనీలు, ఆసుపత్రుల ఫ్రీజర్లను హ్యాక్ చేస్తే పరిణామాలు ఊహించని విధంగా ఉంటాయి. నిర్దిష్ట ఉష్ణోగ్రతల్లో దాచాల్సిన మందులు నాశనమైతే ప్రజారోగ్యానికి, రోగుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది.
IoT Cyber Attacks | సురక్షితమైన వాడకమే ఏకైక మార్గం..
స్మార్ట్ పరికరాలు ఎంత సౌకర్యాన్ని ఇస్తాయో, అంతటి సైబర్ భద్రతనూ పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. బలమైన పాస్వర్డ్లు పెట్టుకోవడం, సాఫ్ట్వేర్ అప్డేట్లను ఎప్పటికప్పుడు పూర్తి చేయడం, సురక్షితమైన వైఫై నెట్‌వర్క్‌లను మాత్రమే వాడటం అత్యవసరమని స్పష్టం చేస్తున్నారు. వాణిజ్య సంస్థలు కూడా తమ ఐఓటీ (IoT) సిస్టమ్స్‌కు అనధికార యాక్సెస్ లేకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టకపోతే, ఈ స్మార్ట్ పరికరాలే హ్యాకర్లకు ఆయుధాలుగా మారతాయని హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Mahanadi Coalfields IPO | ఇన్వెస్టర్లకు శుభవార్త.. త్వరలో కోల్ ఇండియా నుంచి మరో ఐపీవో!