అక్షరటుడే వెబ్‌డెస్క్: Modi Trump Meeting | త్వరలోనే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమావేశం కానున్నట్లు అంతర్జాతీయ దౌత్య వర్గాల ద్వారా తెలుస్తోంది. ఫ్రాన్స్ వేదికగా జరగనున్న జీ-7 (G7 Summit) శిఖరాగ్ర సమావేశాల సందర్భంగా ఈ ఇద్దరు ప్రపంచ దేశాల అగ్రనేతలు ముఖాముఖి కలవబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
Modi Trump Meeting | జూన్ 15 నుంచి జీ-7 సదస్సు..
ఫ్రాన్స్‌లోని ‘ఎవియన్ లే బైన్స్’ వేదికగా జూన్ 15 నుండి 17 వరకు జీ-7 శిఖరాగ్ర సమావేశాలు జరగనున్నాయి. ఈ సదస్సుకు భాగస్వామ్య దేశం హోదాలో భారతదేశానికి ప్రత్యేక ఆహ్వానం అందింది. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారని ఫ్రాన్స్ విదేశాంగ శాఖ ఇప్పటికే ధ్రువీకరించింది. మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ఈ సదస్సుకు హాజరవుతారని వైట్‌హౌస్ అధికారుల ఆధారంగా అమెరికా మీడియా వెల్లడించింది.

Modi Trump Meeting | వ్యూహాత్మక చర్చలు..
ఈ అంతర్జాతీయ సదస్సు పక్కన బెట్టి, మోదీ-ట్రంప్ మధ్య ప్రత్యేకంగా ద్విపాక్షిక చర్చలు జరిగే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇరు దేశాల విదేశాంగ శాఖల నుండి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. భారత్-అమెరికా దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి, కీలక వ్యూహాత్మక రంగాలలో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడానికి ఈ భేటీ ఒక గొప్ప అవకాశంగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Modi Trump Meeting | యుద్ధ సంక్షోభం వేళ కీలక భేటీ..
ప్రస్తుతం పశ్చిమాసియా రీజియన్‌లో ముదురుతున్న ఉద్రిక్తతలు, ప్రపంచ దేశాలను వేధిస్తున్న చమురు సంక్షోభం, హర్మూజ్ జలసంధి దిగ్బంధనం వంటి అంతర్జాతీయ సవాళ్లపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. కాగా, గత ఏడాది (2025) ఫిబ్రవరిలో ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వెళ్లిన సందర్భంలో చివరిసారిగా డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశమయ్యారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు వీరిద్దరూ భేటీ కానుండటంతో ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
ఇది కూడా చదవండి: KTR Padayatra | ‘కారు’ గేరు ఎప్పుడు మార్చాలో తెలుసు.. వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తా : కేటీఆర్
