అక్షరటుడే వెబ్‌డెస్క్: CBSE Evaluation Portal | సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షల డిజిటల్ మూల్యాంకన (ఆన్-స్క్రీన్ మార్కింగ్) వ్యవస్థలో చోటుచేసుకున్న లోపాలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. జవాబు పత్రాలు మారిపోయాయంటూ విద్యార్థుల నుంచి వచ్చిన ఫిర్యాదులతో మొదలైన ఈ వివాదం, చివరకు ఒక పెద్ద సైబర్ దాడి కోణాన్ని వెలుగులోకి తెచ్చింది.
CBSE Evaluation Portal | రంగంలోకి ఐఐటీ నిపుణుల కమిటీ..
ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం ఐఐటీ కాన్పూర్, ఐఐటీ మద్రాస్ నిపుణులతో కూడిన ఒక హైలెవెల్ కమిటీని ఏర్పాటు చేసింది. సీబీఎస్‌ఈ, ఓఎస్‌ఎం (OSM) పోర్టల్స్‌లో ఉన్న భద్రతా లోపాలను టార్గెట్ చేస్తూ, హ్యాకర్లు అత్యంత శక్తిమంతమైన ‘క్లౌడ్ టూల్స్’ (లేదా ఏఐ టూల్స్) ఉపయోగించి ప్రవేశించినట్లు ఈ కమిటీ ప్రాథమికంగా గుర్తించిందని జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

CBSE Evaluation Portal | టెక్నికల్ పార్ట్‌నర్ వైఫల్యం?
ఈ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను నిర్వహిస్తున్న ‘కోఎంప్ట్ ఎడ్యుటెక్’ సంస్థకు, ఇంతటి భారీ పోర్టల్‌ను సురక్షితంగా ఉంచేందుకు అవసరమైన సాంకేతిక నైపుణ్యం గానీ, అవగాహన గానీ లేవని నిపుణుల బృందం గుర్తించినట్లు సమాచారం. పరిస్థితి తీవ్రతను గమనించిన కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని.. ఓఎస్‌ఎం డేటా మొత్తాన్ని ‘అమెజాన్ వెబ్ సర్వీసెస్’ (AWS) ఇండియాకు చెందిన ప్రభుత్వ నియంత్రిత క్లౌడ్ విభాగానికి సురక్షితంగా బదిలీ చేసింది. నిపుణుల నిరంతర కృషితో ఎట్టకేలకు సీబీఎస్‌ఈ వెరిఫికేషన్, రీవాల్యుయేషన్ పోర్టల్స్ మళ్లీ అందుబాటులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో, ఇతర ప్రభుత్వ పరీక్షల భద్రతా వ్యవస్థలను కూడా సమీక్షించే బాధ్యతను కేంద్రం ఈ ప్యానెల్‌కే అప్పగించింది.

CBSE Evaluation Portal | ఇది ఎథికల్ హ్యాకింగా? సాధారణ దాడా?
ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని కేవలం ఒక సాధారణ సైబర్ దాడిగా చూడటం లేదు. సిస్టమ్ పూర్తిగా లైవ్‌లోకి వచ్చే ముందే, అందులోని లోపాలను ఎత్తిచూపేందుకు ‘ఎథికల్ హ్యాకర్లు’ చేసిన ప్రయత్నమై ఉండవచ్చని కొందరు ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. అయితే, ఇది ఎలాంటి హ్యాకింగ్ అయినప్పటికీ.. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే కీలక ప్రాజెక్టులలో సైబర్ సెక్యూరిటీ ప్రమాణాలు ఎంత బలహీనంగా ఉన్నాయనే దానికి ఈ ఘటన అద్దం పడుతోంది.
ఇది కూడా చదవండి: Junior Lecturers | జూనియర్ లెక్చరర్ల సర్వీస్ కౌంట్ చేస్తూ జీవో విడుదల
