Parama Ekadashi 2026| మూడేళ్లకు ఒకసారి వచ్చే పరమ ఏకాదశి.. ఈ ఒక్క వ్రతంతో కష్టాలన్నీ దూరం

హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన రోజుల్లో ఏకాదశి ఒకటి. సాధారణంగా సంవత్సరంలో24 ఏకాదశులు వస్తుంటాయి.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Parama Ekadashi 2026 | హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన రోజుల్లో ఏకాదశి ( Ekadashi )  ఒకటి. సాధారణంగా సంవత్సరంలో24 ఏకాదశులు వస్తుంటాయి. కానీ, ఈ సంవత్సరం (2026) ‘అధిక మాసం’ రావడం వల్ల మొత్తం 26 ఏకాదశులు వచ్చాయి. ఇందులో భాగంగానే మూడేళ్లకు ఒకసారి అధిక జ్యేష్ఠ మాసంలో వచ్చే ‘పరమ ఏకాదశి’ వ్రతాన్ని ఎప్పుడు ఆచరించాలనే విషయంపై భక్తుల్లో కొంత గందరగోళం నెలకొంది. ఈ వ్రతాన్ని జూన్ 11న ఆచరించాలా లేక జూన్ 12నా? అనే సందిగ్ధతకు పంచాంగం ప్రకారం పండితులు స్పష్టతనిచ్చారు. పరమ ఏకాదశి తిథి జూన్ 10వ తేదీ బుధవారం రాత్రి 12:57 గంటలకు ప్రారంభమై, జూన్ 11వ తేదీ గురువారం రాత్రి వరకు ఉంటుంది. సూర్యోదయ తిథిని ప్రామాణికంగా తీసుకుంటారు కాబట్టి, జూన్ 11వ తేదీ గురువారం రోజే పరమ ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలని పండితులు స్పష్టం చేస్తున్నారు.

Parama Ekadashi 2026 | విశిష్టత..

శ్రీమహావిష్ణువుకు అంకితమైన ఈ పరమ ఏకాదశి వ్రతానికి పురాణాల్లో విశేష ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున ఉపవాసం ఉండి స్వామివారిని పూజించడం వల్ల కరవు తీరి, ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. పురాణాల ప్రకారం, సంపదలకు అధిపతి అయిన కుబేరుడు ఈ వ్రతాన్ని ఆచరించి శివుని అనుగ్రహాన్ని పొందాడు. అలాగే సత్యహరిశ్చంద్రుడు కూడా ఈ వ్రత ప్రభావంతోనే తన కోల్పోయిన రాజ్యాన్ని, భార్యాపిల్లలను తిరిగి పొందాడని చెబుతుంటారు. ఈ పుణ్యదినాన ఐదు రోజుల పాటు స్వర్ణ, జ్ఞాన, అన్న, భూ, గోదానాలు చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.

Parama Ekadashi 2026 | పూజా విధానం ఇలా..

పరమ ఏకాదశి రోజున ఉదయమే స్నానాది కార్యక్రమాలు ముగించుకుని మొదటగా వినాయకుడిని పూజించాలి. ఆ తర్వాత పూజా మందిరంలో ఈశాన్య మూలన చిన్న పీఠాన్ని ఏర్పాటు చేసి, దానిపై ఏడు వడ్లు (ధాన్యం గింజలు) ఉంచి, నీటి కలశాన్ని ప్రతిష్టించాలి. ఆ కలశాన్ని మామిడి లేదా అశోక ఆకులతో అలంకరించుకోవాలి. లక్ష్మీ సమేతుడైన విష్ణుమూర్తి విగ్రహాన్ని ఉంచి, పసుపు రంగు పువ్వులు, పండ్లు, తులసి దళాలను సమర్పించాలి. దక్షిణావృత శంఖంలో కుంకుమ, పాలు కలిపి స్వామివారికి అభిషేకం చేయడం చాలా మంచిది. చివరగా ధూపదీపాలు సమర్పించి, కర్పూర హారతి ఇవ్వాలి.

Parama Ekadashi 2026 | వ్రత కథేంటంటే?

పూర్వం సుమేధ అనే పరమ భక్తుడైన బ్రాహ్మణుడు, ఆయన భార్య పవిత్ర తీవ్ర పేదరికంలో ఉండేవారు. ఒకరోజు వారి ఇంటికి కౌండిన్య మహర్షి విచ్చేశారు. ఆ దంపతులు చేసిన సేవలకు సంతోషించిన మహర్షి, వారి దారిద్ర్యాన్ని పోగొట్టుకోవడానికి ఒక మార్గాన్ని సూచించారు. అధిక మాసంలో వచ్చే ఏకాదశి రోజున ఉపవాసం ఉండి, రాత్రి జాగరణ చేస్తూ విష్ణుమూర్తిని పూజిస్తే కష్టాలు తీరుతాయని చెప్పారు. మహర్షి మాట ప్రకారం ఆ దంపతులు భక్తిశ్రద్ధలతో ఈ పరమ ఏకాదశి వ్రతాన్ని ఆచరించారు. ఈ వ్రత మహాత్మ్యం వల్ల వారి పేదరికం తొలగిపోయి, అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో జీవించారని పురాణాలు చెబుతున్నాయి.

ఇది కూడా చదవండి:  Pawan Kalyan Hyderabad | హైదరాబాద్ ఎవరి జాగీరు కాదు..రేవంత్ వ్యాఖ్యలపై పవన్ ఫైర్

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *