అక్షరటుడే వెబ్‌డెస్క్: Pawan Kalyan Hyderabad | హైదరాబాద్ ఎవరి సొంత జాగీరు కాదని, తనను తెలంగాణకు రానివ్వబోమనే వాళ్లకు గట్టి సమాధానం చెబుతానని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) స్పష్టం చేశారు. జాతీయ మీడియాతో మాట్లాడిన ఆయన.. ఉత్తర, దక్షిణ భారతదేశాల మధ్య ప్రాంతీయ విభేదాలను తీసుకువచ్చేలా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బాధ్యతాయుతమైన సీఎం పదవిలో ఉండి ఇలాంటి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఆ లెక్కన చూస్తే దేశాన్ని ఏకం చేసిన ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ కూడా గుజరాత్‌కు చెందినవారేనని గుర్తు చేశారు. దేశాన్ని విడదీసేలా మళ్లీ ఉత్తర-దక్షిణ కోణంలో మాట్లాడొద్దని రేవంత్ రెడ్డికి పవన్ హితవు పలికారు.
Pawan Kalyan Hyderabad | కాంగ్రెస్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ..
తనను హైదరాబాద్ రావద్దంటూ బెదిరిస్తున్న శక్తులపై పవన్ కళ్యాణ్ విరుచుకుపడ్డారు. బీఆర్‌ఎస్ కాకుండా, ఒక జాతీయ పార్టీకి చెందిన వారు ఇలా ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టడం వింతగా ఉందన్నారు. హైదరాబాద్‌లో అడుగుపెట్టనివ్వబోమంటూ కొందరు అల్లరి మూకలను తనపైకి పంపుతున్నారని ఆరోపించారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక తనను హైదరాబాద్ రావద్దని చెబితే.. అప్పుడు తాను ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి ఓ మాట చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు. రాహుల్ గాంధీకి అసలు దక్షిణ భారతదేశంతో ఏం సంబంధం ఉందని, ఆయన ఇక్కడి వాడు కాదు కదా అని తాను కూడా అనాల్సి వస్తుందంటూ కాంగ్రెస్‌కు పవన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తన సొంత దేశంలో ఎక్కడికైనా వెళ్లే హక్కు తనకు ఉందని, దీనికోసం ఎవరి అనుమతి అడగాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు.

Pawan Kalyan Hyderabad | తెలంగాణ రాజకీయంపై క్లారిటీ..
తెలంగాణలో జనసేన పార్టీ భవిష్యత్తుపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తన పూర్తి దృష్టి ఆంధ్రప్రదేశ్‌పైనే ఉందని స్పష్టం చేశారు. అయితే తెలంగాణలో తనకు బలమైన క్యాడర్, యువత మద్దతు ఉందని చెప్పారు. తనకు తెలంగాణలో ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆసక్తి లేకపోయినప్పటికీ.. తమ నాయకులు, క్యాడర్ ద్వారా తెలంగాణ అభివృద్ధికి ఎప్పుడూ కట్టుబడి ఉంటానని పవన్ వివరించారు.
Pawan Kalyan Hyderabad | నక్సలైట్‌గా మారాలనుకున్నా..
ఇదే ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ తన టీనేజ్ రోజులకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. తన వయసు పద్దెనిమిది, పంతొమ్మిదేళ్ల సమయంలో సమాజంలోని అసమానతలను చూసి తీవ్రంగా చలించిపోయానని చెప్పారు. ఆ సమయంలో తుపాకీ పట్టి నక్సలైట్‌గా మారిపోవాలని అనుకున్నట్లు సంచలన ప్రకటన చేశారు. అయితే, ఆ దశలో తన అన్న చిరంజీవి తనను గమనించి, సమాజానికి ఉపయోగపడే ఒక మంచి మార్గం వైపు నడిపించారని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Double Bedroom Houses | డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల కేటాయింపులపై సర్కార్ కీలక ఆదేశాలు
