అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Trump Warning Iran | అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ దాడులు ప్రారంభం అయ్యాయి. కాల్పుల విరమణ ఒప్పందం అమలులోకి వచ్చిన తర్వాత తొలిసారి రెండు దేశాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. దీంతో మరోసారి పశ్చిమాసియా మరోసారి భగ్గుమంది.
తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ టెహ్రాన్, బందర్ అబ్బాస్ సహా 20 ప్రాంతాల్లోని ఇరాన్ (Iran) లక్ష్యాలపై అమెరికా వైమానిక దాడులకు తెగబడింది. తమ అపాచీ హెలికాప్టర్‌ను కూల్చేసినందుకు ప్రతికారంగా యూఎస్ సెంట్రల్ కమాండ్ ఈ భీకర దాడులు చేసింది. దీనికి ప్రతిగా బహ్రెయిన్, కువైట్, జోర్డాన్‌లలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. ఈ క్రమంలో ట్రంప్ (Trump) ఇరాన్‌కు వార్నింగ్ ఇచ్చారు.
Trump Warning Iran | డీల్ కుదుర్చుకోవాలి
డీల్ కుదుర్చుకోకుండా ఇరాన్ ఆలస్యం చేస్తోందని ట్రంప్ మండిపడ్డారు. ఇప్పటికే ఆ దేశం సైనిక పరంగా తీవ్రంగా నష్టపోయిందని పేర్కొన్నారు. తాజాగా బహ్రెయిన్, కువైట్, జోర్డాన్‌లలోని అమెరికా స్థావరాలపై దాడులు చేసినందుకు ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అమెరికా దళాలు ఇరాన్‌పై తాజాగా 49 టోమాహాక్ క్షిపణులను ప్రయోగించాయని ట్రంప్ తెలిపారు.
Trump Warning Iran | రాత్రికి బాంబుల వర్షం..
యుద్ధాన్ని ముగించడానికి అమెరికా షరతులను ఇరాన్ అంగీకరించకపోతే ఈ రాత్రే వారిపై బాంబుల వర్షం కురిపిస్తాం అని ట్రంప్ పేర్కొన్నట్లు సమాచారం. తనకు ఇరాన్ నాయకులు ఫోన్ చేసి దాడులు ఆపాలని కోరినట్లు ఆయన పేర్కొన్నారు. అయితే ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ట్రంప్ వాదనలను ఖండించింది.
Trump Warning Iran | హర్ముజ్ మూసివేత
అమెరికా దాడులు జరిగిన కొద్దిసేపటికే హర్ముజ్ జలసంధిని మూసివేసినట్లు ఐఆర్జీసీ ప్రకటించింది. ఈ ప్రాంతంలో నెలకొన్న అభద్రత కారణంగా, చమురు ట్యాంకర్లు, వాణిజ్య నౌకలతో సహా అన్ని నౌకలకు హర్ముజ్ జలసంధి (Strait of Hormuz)ని తక్షణమే మూసివేసినట్లు పేర్కొంది. అయితే హర్ముజ్ మీదుగా నౌకల రాకపోకలు కొనసాగుతున్నాయని అమెరికా పేర్కొంది. యుద్ధం తీవ్రం అయితే మరోసారి ప్రపంచ వ్యాప్తంగా చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి..: Helicopter Crash | పీవోకేలో కూలిన పాక్ ఆర్మీ హెలికాప్టర్.. 21 మంది మృతి