అక్షరటుడే, వెబ్‌డెస్క్: Warangal SI Case | ఎస్సై చేతిలో మోసపోయిన ఓ వివాహిత తనకు న్యాయం చేయాలంటూ పోలీసులనే ఆశ్రయించిన ఘటన వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో చర్చనీయాంశంగా మారింది. తన జీవితంలో అండగా ఉంటానని, వివాహం చేసుకుంటానని నమ్మించి నాలుగేళ్లుగా మోసం చేశాడంటూ ఓ ఎస్ఐపై బాధితురాలు తీవ్ర ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేసింది.
Warangal SI Case | వివాహం చేసుకుంటానని నమ్మబలికి..
బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. గతంలో హన్మకొండ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సమయంలో తన కుటుంబ సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా ఆ పోలీసు అధికారి పరిచయమయ్యాడని తెలిపింది. తన భర్తతో విడాకులు ఇప్పించి, అనంతరం వివాహం చేసుకుంటానని నమ్మబలికాడని ఆరోపించింది.
కాలక్రమేణా తనపై పూర్తి ఆధిపత్యం సాధించి, వివాహం పేరుతో తనను మోసం చేశాడని బాధితురాలు వాపోయింది. పలుమార్లు గర్భం దాల్చిన సందర్భాల్లో కూడా తనను ఒత్తిడికి గురిచేశాడని, ఇటీవల బలవంతంగా గర్భస్రావానికి సంబంధించిన మాత్రలు తీసుకునేలా చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో తీవ్ర రక్తస్రావం జరిగి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
Warangal SI Case | బెదిరింపులు..
తనను వివాహం చేసుకోవాలని అడిగిన ప్రతిసారి తప్పించుకునేవాడని, చివరకు ఫొటోలు, వ్యక్తిగత వివరాలు బయటపెడతానంటూ బెదిరింపులకు దిగాడని బాధితురాలు ఆరోపించింది.
ఏళ్ల తరబడి మానసిక, శారీరక వేదన అనుభవించిన అనంతరం చివరకు ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించానని బాధితురాలు తెలిపింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా హన్మకొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం.
ఈ వ్యవహారంలో నిజానిజాలు దర్యాప్తు అనంతరం వెలుగులోకి రానున్నాయి. ప్రస్తుతం బాధితురాలు చేసిన ఆరోపణలపై పోలీసు శాఖ నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది.



