అక్షరటుడే, ఎల్లారెడ్డి : School Bus Fitness | రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి పాఠశాలలు పున : ప్రారంభం కానున్నాయి. ప్రైవేట్ పాఠశాలలకు విద్యార్థులు చాలా మంది బస్సుల్లో పంపుతారు. కొందరు ఆటోలు, వ్యాన్లను ఆశ్రయిస్తారు. అయితే చాలా వరకు విద్యార్థులను తీసుకు వెళ్లే బస్సులు, వ్యాన్లు ఫిట్నెస్ లేకపోవడంతో ప్రమాదాల బారిన పడిన ఘటనలు ఉన్నాయి. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలో రవాణా శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. విద్యార్థుల భద్రతపై రవాణా శాఖ (RTA) అధికారులు ఫోకస్ పెట్టారు. ఫిట్నెస్ సర్టిఫికెట్ లేని, రూల్స్ పాటించని స్కూల్ బస్సులు, వ్యాన్లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు.
కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లోని ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ల బస్సులను ఆర్టీఏ, పోలీస్ అధికారులు కలిసి తనిఖీ చేస్తున్నారు. ఫిట్నెస్, పర్మిట్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్లు, డ్రైవర్ లైసెన్స్, బస్సులో ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఫైర్ ఎక్స్టింగ్విషర్, ఎమర్జెన్సీ డోర్ సరిగా ఉన్నాయా అని పరిశీలించనున్నారు. నిబంధనలు పాటించని పాఠశాలల బస్సులను సీజ్ చేస్తామని అధికారులు హెచ్చరించారు. గతంలో పలు ప్రైవేట్ పాఠశాలల బస్సులు ప్రమాదాల బారీన పడటంతో ఈ ఏడాది ముందస్తు చర్యలు చేపట్టారు. రేపటి నుంచి తనిఖీలు చేపట్టనున్నారు.
School Bus Fitness | ఇవి తప్పనిసరి
వాహనానికి ఫిట్నెస్ సర్టిఫికెట్, పర్మిట్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్ ఉండాలి. బస్సు సామర్థ్యం మేరకే విద్యార్థులను ఎక్కించుకోవాలి. డ్రైవర్‌కు లైసెన్స్, 5 ఏళ్ల అనుభవం ఉండాలి. స్పీడ్ గవర్నర్, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఫైర్ సేఫ్టీ నిబంధనలు బస్సులో అమలు చేయాలి. వాహనం లైట్లు, ఎమర్జెన్సీ డోర్, విండో సక్రమంగా ఉండాలి. ఏమైనా మరమ్మతులు ఉంటే ఇప్పుడే చేయించాలి. ప్రతి బస్సుకు ఒక ఆయాను నియమించాలి. ఆయా లేకుండా పిల్లలను పంపించొద్దు.
School Bus Fitness | తల్లిదండ్రులు జాగ్రత్త
పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపే తల్లిదండ్రులు సైతం అప్రమత్తంగా ఉండాలి. స్కూల్ బస్సు కండిషన్ ఎలా ఉంది? డ్రైవర్‌కు తాగి వచ్చే అలవాటు ఉందా? సీట్ల కంటే ఎక్కువ మంది ఎక్కుతున్నారా? అని చెక్ చేసుకోవాలి. ఏమైనా సమస్యలు ఉంటే.. రవాణా శాఖ టోల్ ఫ్రీ నంబర్ 1800-425-8002కు ఫిర్యాదు చేయొచ్చు.
School Bus Fitness | తప్పనిసరిగా ఫిట్నెస్ చేయించాల్సిందే..
– దుర్గా ప్రమీల, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్
నిజామాబాద్‌లో జిల్లాలో సుమారు 800 బస్సులు ఉండగా ఇప్పటివరకు 648 బస్సులు ఫిట్నెస్ టెస్ట్ పూర్తి చేసుకున్నాయి. కామారెడ్డిలో 277 బస్సులు ఉండగా 190 బస్సులు టెస్ట్‌లు పూర్తయ్యాయి. మిగితా బస్సులకు కూడా పరీక్షలు పూర్తి చేస్తాం. నిబంధనల ప్రకారమే స్కూల్ బస్సులు రోడ్లపైకి రావాల్సి ఉంటుంది. తాజాగా జిల్లాలో మొబైల్ స్క్వాడ్ ఏర్పాటు చేశాం. ఎంవీఐ, ముగ్గురు ఏఎంవీఐలు, ఇద్దరు హోంగార్డులతో బృందం నిరంతరం తనిఖీలు చేస్తుంది. ప్రత్యేక బృందాలు నిరంతరం తనిఖీలు చేస్తూనే ఉంటాయి.
దీనిని కూడా చదవండి : Sadaram Dates | సోషల్ మీడియాలో సదరం తేదీలపై ఫేక్ ప్రచారం.. నమ్మొద్దని డీఆర్డీవో సూచన