అక్షరటుడే, కామారెడ్డి : Journalist Accreditation Cards | జిల్లాలో అర్హత ఉన్న జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు అందజేస్తామని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ హామీ ఇచ్చారు. డీపీఆర్వో నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ టీయుడబ్ల్యూజే(ఐజేయూ) ఆధ్వర్యంలో బుధవారం తలపెట్టిన ధర్నా నేపథ్యంలో కలెక్టర్ యూనియన్ నాయకులతో ప్రత్యేకంగా సమావేశమై చర్చలు జరిపారు.
సమావేశంలో జర్నలిస్టులు తమ సమస్యలను కలెక్టర్కు వివరించారు. జిల్లాలో 273 కార్డులకు ఆమోదం లభించినా కొన్ని మాత్రమే పంపిణీ చేశారని, మిగతా వాటికి డీపీఆర్వో అనవసర కొర్రీలు పెడుతున్నారని తెలిపారు. బస్ పాసుల విషయంలోనూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. సదరు అధికారిని వెంటనే బదిలీ చేయాలని లేదా శాఖకు సరెండర్ చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కలెక్టర్, అక్రిడిటేషన్ కార్డుల విషయంలో జర్నలిస్టులు ఆందోళన చెందవద్దని, అర్హులందరికీ కార్డులు అందుతాయని భరోసా ఇచ్చారు.
Journalist Accreditation Cards | చర్యలు తీసుకుంటాం
డీపీఆర్వో వైఖరిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ ప్రక్రియను పర్యవేక్షించి త్వరితగతిన కార్డులు జారీ చేసే బాధ్యతను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.వి. గిరికి అప్పగించారు. అక్రిడిటేషన్ కమిటీ సభ్యులతో చర్చించి అర్హులందరికీ కార్డులు అందేలా చూడాలని ఆదేశించారు. కలెక్టర్ హామీతో జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు వి. రజినీకాంత్, కార్యదర్శి తోట రాజేష్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు పట్నం శ్రీనివాస్, కార్యదర్శి సుధాకర్ గౌడ్, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, ఈసీ సభ్యులు పాల్గొన్నారు.
దీనిని కూడా చదవండి : Telangana SIR Process | పార్టీ కోసం పనిచేయని వారికి స్థానం లేదు.. ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ వార్నింగ్