Crude Oil Prices | భారీగా తగ్గిన ముడి చమురు ధరలు..

పశ్చిమాసియాలో యుద్ధం ముగియడం, హర్ముజ్​ జలసంధి తెరుచుకోవడంతో ముడి చమురు ధరలు భారీగా తగ్గాయి.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Crude Oil Prices | పశ్చిమాసియాలో యుద్ధం ముగిసింది. అమెరికా–ఇరాన్​ మధ్య ఒప్పందం ఖరారు కావడం, శాంతి చర్చలు కొనసాగుతుండటంతో ముడి చమురు ధరలు భారీగా దిగి వచ్చాయి. దీంతో ప్రపంచ దేశాలకు ఎంతో ఊరట లభించనుంది.

ఇరాన్​పై అమెరికా, ఇజ్రాయెల్ ఫిబ్రవరి 28న దాడులు చేసిన విషయం తెలిసిందే. దీంతో పశ్చిమాసియాలో యుద్ధం మొదలైంది. చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్​ జలసంధిని (Strait of Hormuz) ఇరాన్​ మూసివేసింది. దీంతో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. యుద్ధానికి ముందు 70 డాలర్లలోపు ఉన్న బ్రెంట్ క్రూడ్​ ధర.. తర్వాత ఒక దశలో 120 డాలర్ల వరకు పెరిగింది. అనంతరం కొంత మేర దిగి వచ్చి 90 నుంచి 100 డాలర్ల మధ్య కదలాడింది. అయితే ముడి చమురు ధరలు పెరగడంతో ప్రపంచ దేశాలు అతలాకుతలం అయ్యాయి. చమురు రవాణా ఆగిపోవడంతో పలు దేశాలు ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి. ఈ క్రమంలో తాజాగా రేట్లు దిగి వచ్చాయి.

Crude Oil Prices | 8 శాతం తగ్గిన రేట్లు

హర్ముజ్ జలసంధి మీదుగా సముద్ర వాణిజ్యం పెరిగిందన్న వార్తల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ఒక వారంలో 8 శాతానికి పైగా తగ్గి, యుద్ధానికి ముందు స్థాయి అయిన బ్యారెల్‌కు సుమారు 72 డాలర్ల వద్దకు చేరుకున్నాయి. ‘బ్రెంట్ క్రూడ్ ఆయిల్’ ధరలు గత ఐదు ట్రేడింగ్ సెషన్లలో 8.5 శాతం తగ్గాయి. ఇంధన ధరలు ఒక నెలలో 24 శాతం, గత మూడు నెలల్లో 28 శాతం మేర తగ్గాయి. హర్ముజ్ జలసంధి మీదుగా నౌకల రాకపోకలు గత 24 గంటల్లో రెట్టింపు అయ్యాయి. మరోవైపు ఇరాన్​ భారీగా ముడి చమురును ఎగుమతి చేస్తోంది. జూన్ 15 నుంచి ఆ దేశం 40 మిలియన్ బారెళ్ల ముడి క్రూడ్​ ఆయిల్​ ఎగుమతి చేసింది. కేవలం శుక్రవారం ఒక్క రోజే 20 మిలియన్ బారెళ్లను ఎక్స్ పోర్ట్ చేయడం గమనార్హం.

Crude Oil Prices | ఇంధన ధరలు తగ్గుతాయా..

ముడి చమురు ధరలు పెరగడంతో దేశంలో పెట్రోల్​, డీజిల్, సీఎన్​జీ ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ధరలు దిగిరావడంతో రేట్లు తగ్గుతాయా లేదా అనే చర్చ సాగుతోంది. అయితే ఇప్పట్లో ధరలు తగ్గే అవకాశం లేదు. చమురు సంస్థలు చాలా రోజుల వరకు రేట్లు పెంచకపోవడంతో భారీగా నష్టపోయాయి. ప్రస్తుతం ధరలు దిగిరావడంతో ఆ నష్టాలను భర్తీ చేసుకునే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి..: Ayodhya terror plot | అయోధ్య రామాలయంపై పేలుళ్లకు భారీ కుట్ర: కర్ణాటకలో పాక్ అనుసంధాన ఉగ్రవాది అరెస్టు!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *