అక్షరటుడే వెబ్‌డెస్క్: Volkswagen Layoffs | ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో ఉద్యోగ కోతలు జరుగుతున్న తరుణంలో, ఇప్పుడు ఆటోమొబైల్ రంగంలోనూ పెను సంచలనం చోటుచేసుకుంది. జర్మనీకి చెందిన ప్రముఖ కార్ల తయారీ దిగ్గజం ‘వోక్స్‌వ్యాగన్’ (Volkswagen) తన కార్యకలాపాలను భారీగా కుదించుకునేందుకు సిద్ధమవుతోంది.
Volkswagen Layoffs | భారీ పునర్వ్యవస్థీకరణకు ప్లాన్..
వోక్స్‌వ్యాగన్ సంస్థ తన చరిత్రలోనే అత్యంత భారీ పునర్వ్యవస్థీకరణకు సిద్ధమవుతోంది. కంపెనీ సీఈఓ ఆలివర్ బ్లూమ్ నాయకత్వంలో రూపొందుతున్న ఈ కొత్త ప్రణాళిక ప్రకారం, దాదాపు లక్ష మంది ఉద్యోగులను తొలగించడంతో పాటు, జర్మనీలోని నాలుగు ప్రధాన తయారీ ప్లాంట్లను పూర్తిగా మూసివేయాలని యాజమాన్యం యోచిస్తోంది. అలాగే, రాబోయే ఐదేళ్లలో పెట్టుబడి ప్రణాళికలను 15 శాతం మేర తగ్గించి, ఖర్చులను 130 బిలియన్ యూరోలకు పరిమితం చేయాలని భావిస్తోంది. వ్యాపారాన్ని మరింత లాభసాటిగా మార్చేందుకు, ‘VW ప్యాసింజర్ కార్’ బ్రాండ్ , విడిభాగాల విభాగాన్ని వేర్వేరు సంస్థలుగా విడగొట్టే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు.

Volkswagen Layoffs | ఎందుకీ కఠిన నిర్ణయాలు?
ప్రస్తుతం వోక్స్‌వ్యాగన్ తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటోంది. దీనికి ప్రధానంగా చైనాకు చెందిన ఎలక్ట్రిక్ వాహన (EV) తయారీ సంస్థల నుండి ఎదురవుతున్న తీవ్రమైన పోటీ, అమెరికా ప్రభుత్వం విధిస్తున్న భారీ టారిఫ్‌లు, ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలోకి మారుతున్న క్రమంలో పెరుగుతున్న నిర్వహణ వ్యయాలు ప్రధాన కారణాలుగా నిలిచాయి. ఈ సవాళ్ల నేపథ్యంలో కంపెనీ తన వ్యాపారాన్ని లాభసాటిగా మార్చుకోవడానికి ఇటువంటి కఠిన నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. ఈ పరిస్థితుల దృష్ట్యా, లాభాలను పెంచుకోవడంపై దృష్టి సారించిన సీఈఓ ఆలివర్ బ్లూమ్, హానోవర్, జ్విక్కావ్, ఎమ్డెన్ , ఆడి (Audi) కి చెందిన నెక్కర్సల్మ్ ప్లాంట్లలో ఉత్పత్తిని నిలిపివేయాలని భావిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి.
Volkswagen Layoffs | కార్మిక సంఘాల తీవ్ర వ్యతిరేకత..
ఈ ప్రతిపాదిత చర్యలు అమలైతే, వోక్స్‌వ్యాగన్ ప్రపంచవ్యాప్త శ్రామిక శక్తిలో దాదాపు 15 శాతం మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంది. గతంలో జరిగిన 50,000 ఉద్యోగాల కోతతో పోలిస్తే ఇది అత్యంత భారీ పరిణామం. అయితే, ఈ వార్తలపై వోక్స్‌వ్యాగన్ అధికారికంగా స్పందించలేదు. మరోవైపు, ఈ నిర్ణయాలను తాము ఏమాత్రం సహించేది లేదని కంపెనీ వర్క్స్ కౌన్సిల్ , ప్రముఖ కార్మిక సంఘం ‘ఐజీ మెటల్’ (IG Metall) హెచ్చరించాయి. ప్లాంట్ల మూసివేత, భారీ ఉద్యోగాల కోతలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని, ఉద్యోగుల హక్కుల కోసం పోరాడుతామని ఆ సంఘాలు స్పష్టం చేశాయి.
ఇది కూడా చదవండి: Kammarpally Police | మనస్తాపంతో ఒకరి ఆత్మహత్య