RTC Protest | ప్రభుత్వ తీరుపై నిరసన.. నర్సంపేటలో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం!

Srinivas Kolluri

అక్షరటుడే, నర్సంపేట: RTC Protest | తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు (RTC Workers) చేపట్టిన సమ్మె రెండో రోజూ తీవ్ర విషాదాన్ని నింపింది. వరంగల్ జిల్లా నర్సంపేట డిపోకు చెందిన ఓ డ్రైవర్, ప్రభుత్వంపై నిరసనగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తమ డిమాండ్ల పట్ల సర్కారు మొండివైఖరి ప్రదర్శిస్తోందన్న ఆవేదనతోనే ఆయన ఈ అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది.

RTC Protest | ప్రభుత్వం స్పందించకపోవడం:

నర్సంపేట డిపో (Narsampeta Depot)లో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న కోలా శంకర్ గౌడ్, గత రెండు రోజులుగా తోటి కార్మికులతో కలిసి సమ్మెలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్‌తో పాటు ఇతర సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ క్రమంలోనే గురువారం నర్సంపేట బస్టాండ్ (Narsampet Bus Stand) వద్దకు పెట్రోల్ బాటిల్‌తో వచ్చిన శంకర్ గౌడ్, అందరూ చూస్తుండగానే తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు.

RTC Protest | తీవ్రంగా గాయపడిన శంకర్ గౌడ్‌:

మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన తోటి కార్మికులు, స్థానికులు వెంటనే వాటిని ఆర్పివేశారు. తీవ్రంగా గాయపడిన శంకర్ గౌడ్‌ను హుటాహుటిన వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని, వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారని సమాచారం.

RTC Protest | కోర్కెలు తీర్చేవరకు వెనక్కి తగ్గేది లేదు:

ఈ ఘటనతో ఆర్టీసీ డిపోల వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. శంకర్ గౌడ్ ఆత్మహత్యాయత్నానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని కార్మికులు మండిపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. పలుచోట్ల పోలీసులు కార్మికులను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. పోలీసుల తీరుపై సోషల్ మీడియాలో సైతం తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమ న్యాయమైన కోర్కెలు తీర్చేవరకు వెనక్కి తగ్గేది లేదని కార్మిక సంఘాలు స్పష్టం చేస్తున్నాయి.

ఇది కూడా చదవండి..: Yellow Alert | మరో రెండు గంటల్లో వడగళ్ల వాన.. ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *