అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Warangal Cancer Hospital | రాష్ట్రంలో రెండో అతిపెద్ద ప్రభుత్వ క్యాన్సర్ హాస్పిటల్‌ను వరంగల్‌లో ఏర్పాటు చేస్తామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ (Damodar Rajanarsimha) తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలతో మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు.
ఉత్తర తెలంగాణ ప్రజలకు అత్యాధునిక క్యాన్సర్ వైద్య సేవలను అందించే విధంగా వరంగల్ రీజనల్ క్యాన్సర్ హాస్పిటల్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ఈ ఏడాది చివరికల్లా అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, జనరల్ హాస్పిటళ్లు, సీహెచ్‌సీలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రజలకు అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు.
Warangal Cancer Hospital | మరో 9 సూపర్ స్పెషాలిటీ సేవలు
ఎంజీఎం హాస్పిటల్ (MGM Hospital)లో ప్రస్తుతం 29 స్పెషాలిటీల్లో వైద్య సేవలు అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. మరో 9 సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను త్వరలో ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఇందుకు అవసరమైన చర్యలు వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. నిమ్స్ తరహాలో వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు ఎల్‌వోసీలు (LOC) మంజూరు చేస్తామన్నారు.
Warangal Cancer Hospital | హన్మకొండలో ఐవీఎఫ్ సెంటర్
హన్మకొండలో ఐవీఎఫ్ సెంటర్‌తో పాటు డ్రగ్ అండ్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. రీజనల్ ఐ హాస్పిటల్‌లో అత్యాధునిక కంటి వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. పరకాల, వర్ధన్నపేట, స్టేషన్ ఘన్‌పూర్, బచ్చన్నపేట, పాలకుర్తి, కమలాపూర్ ప్రాంతాలకు డయాలసిస్ సెంటర్లు మంజూరు చేశామని గుర్తు చేశారు. ప్రభుత్వ హాస్పిటళ్లను అన్ని విధాలుగా బలోపేతం చేస్తూ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి స్పష్టం చేశారు.
దీనిని కూడా చదవండి : MP Arvind | విద్యార్థుల భవిష్యత్ నాశనం చేస్తున్న సీఎం : ఎంపీ అర్వింద్