అక్షరటుడే వెబ్‌డెస్క్: Bhagyaraj Funeral | తమిళ చిత్రసీమలో గుర్తింపు పొందిన దిగ్గజ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన భౌతికకాయాన్ని కడసారి చూసేందుకు అభిమానులు, సినీ ప్రముఖులు భారీగా తరలివచ్చారు. అయితే, ఈ విషాద సమయంలో కొందరు సోషల్ మీడియాలో వ్యూస్ కోసం అత్యుత్సాహం ప్రదర్శించడంపై నటి రాధికా శరత్‌కుమార్ ( Radhika Sarathkumar) ఘాటుగా స్పందించారు.
Bhagyaraj Funeral | అంత్యక్రియలు ఒక ‘సర్కస్’ కాదు..
భాగ్యరాజ్‌తో 50 సంవత్సరాల అనుబంధాన్ని గుర్తు చేసుకున్న రాధిక, ఆవేదన వ్యక్తం చేస్తూ ఇలా అన్నారు. “ఆయన అద్భుతమైన సృష్టికర్త, రచయిత. అలాంటి వ్యక్తికి తుది వీడ్కోలు పలికే సమయం ఇది. కానీ బాధాతప్త హృదయంతో నివాళులర్పించాల్సిన ప్రదేశాన్ని కొందరు ‘సర్కస్’గా మార్చేశారు. చనిపోయిన వ్యక్తికి, ఆత్మకు సముచిత గౌరవం ఇవ్వకుండా, భావోద్వేగాలను సోషల్ మీడియా వేదికగా వైరల్ చేయడం అత్యంత బాధాకరం. ఈ పద్ధతి మనల్ని ఏ స్థాయికి తీసుకెళ్తోంది ?” అని అన్నారు
Bhagyaraj Funeral | ప్రభుత్వం, చిత్ర పరిశ్రమ జోక్యం చేసుకోవాలి..
ఇలాంటి ప్రవర్తనపై రాధికా శరత్‌కుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వం, ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్, నడిఘర్ సంఘం, ప్రెస్ కౌన్సిల్ వంటి సంస్థలు దీనిపై చర్చించి కఠినమైన ప్రొటోకాల్ తీసుకురావాలని ఆమె డిమాండ్ చేశారు. “అంతిమ సంస్కారాల సమయంలో మీడియాను లేదా కెమెరాలను కచ్చితంగా నియంత్రించాలి. ఎవరి వ్యక్తిగత ప్రైవసీని వారు కాపాడుకునేలా చర్యలు తీసుకోవాలి” అని ఆమె సూచించారు.
Bhagyaraj Funeral | సుహాసిని సైతం తీవ్ర ఆగ్రహం..
భాగ్యరాజ్ అంతిమ యాత్రలో పాల్గొన్న నటి సుహాసిని సైతం, కొందరు కెమెరా పట్టుకుని ప్రదర్శించిన అత్యుత్సాహంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అంత్యక్రియల సమయంలో కన్నీళ్లు పెట్టుకుంటున్న వారిని వెంబడించి ఫొటోలు తీయడంపై ఆమె మండిపడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారాయి. అభిమానుల ఇష్టాఇష్టాలతో సంబంధం లేకుండా, సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలను, బాధను కూడా సోషల్ మీడియా కంటెంట్‌గా మార్చేస్తున్న తీరుపై సినీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Musi River Project | ‘మూసీ’ బాధితులకు డబుల్ ఇళ్లు : మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి