Vana Mahotsavam | లక్ష్యం @ 45 లక్షల మొక్కలు.. వన మహోత్సవానికి సర్వం సిద్ధం..

Balla Sandeep Kumar

అక్షరటుడే, భీమ్​గల్ : Vana Mahotsavam | పర్యావరణ పరిరక్షణ, భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమం నిజామాబాద్ జిల్లా (Nizamabad District)లో జోరుగా సాగుతోంది. జిల్లాలో ఈ ఏడాది 45 లక్షల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మహా యజ్ఞాన్ని విజయవంతం చేసేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ సమగ్ర ప్రణాళికలతో ముందుకు వెళ్తోంది.

ప్రభుత్వ లక్ష్య సాధనలో భాగంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 26.11 లక్షల మొక్కలను నాటేందుకు నిధులు కేటాయించారు. ఈ బృహత్తర కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములను చేస్తూ, ఇంటింటికీ ఆరు మొక్కల చొప్పున 14 లక్షల మొక్కలను పంపిణీ చేయనున్నారు. వీటితో పాటు అటవీ శాఖ, ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో మిగిలిన మొక్కలను ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, రోడ్లకు ఇరువైపులా నాటించేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేశారు.

Vana Mahotsavam | శాఖల వారీగా..

వన మహోత్సవాన్ని విజయవంతం చేయడానికి అన్ని శాఖల అధికారులను ప్రభుత్వం భాగస్వామ్యం చేస్తోంది. ఇందులో భాగంగా గ్రామీణాభివృద్ధి శాఖకు ఉపాధి హామీ పథకం కింద 26.11 లక్షల మొక్కల పెంపకానికి నిధులు కేటాయించారు. అటవీ శాఖ 14 లక్షల మొక్కలను సిద్ధం చేస్తోంది. పట్టణ ప్రాంతాల్లో పార్కులు, రోడ్లకు ఇరువైపులా, ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటడానికి మున్సిపల్ కార్పొరేషన్లు, బల్దియాలు బాధ్యత వహిస్తున్నాయి . నిజామాబాద్ నగరంలో సుమారు 3 లక్షల మొక్కలు నాటనున్నారు. గీత కార్మికుల ప్రయోజనం కోసం 66 వేల ఈత మొక్కలు నాటనున్నారు.

Vana Mahotsavam | సిద్ధంగా గుంతలు

Vana Mahotsavam

మొక్కలు నాటడానికి ముందుగా భూమిని సిద్ధం చేయడంలో అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే మూడున్నర లక్షల గుంతలను తవ్వి సిద్ధం చేశారు. మొక్కలను నర్సరీల నుంచి నేరుగా నాటే ప్రదేశాలకు తరలించేందుకు రవాణా ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ప్రస్తుతం వర్షాల కోసం ఎదురుచూస్తున్నామని, వాతావరణం అనుకూలించి తొలి వర్షం కురవగానే యుద్ధప్రాతిపదికన మొక్కలు నాటే ప్రక్రియను ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు.

Vana Mahotsavam | లక్ష్యం చేరుకుంటాం

– సాయన్న, డీఆర్​డీవో

జిల్లాలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం నిర్దేశించిన 45 లక్షల మొక్కల లక్ష్యాన్ని చేరుకోవడమే మా ప్రధాన ధ్యేయం. మొక్కలు నాటేందుకు అవసరమైన గుంతలను ఇప్పటికే తవ్వి సిద్ధంగా ఉంచాం. వర్షాలు ప్రారంభం కాగానే ఈ ప్రక్రియను వేగవంతం చేస్తాం. ప్రజలందరినీ భాగస్వాములను చేస్తూ, నాటిన ప్రతి మొక్క సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నాం. వాతావరణ పరిస్థితులు సహకరిస్తే, అనుకున్న సమయానికి నిర్దేశిత లక్ష్యాన్ని వంద శాతం పూర్తి చేస్తాం.

ఇది కూడా చదవండి..: Voter List Discrepancy | ఓట్ల తొలగింపులో పక్షపాతం.. కొడంగల్​లో 33 వేలకు పైగా నకిలీ​ ఓట్లు ఉన్నా పట్టించుకోరే : కల్వకుంట్ల కవిత ఘాటు విమర్శ

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *