అక్షరటుడే, ఇందూరు: Dinesh Kulachari | జిల్లాలో వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా పంటల సాగు, సాగునీటి సరఫరాపై తక్షణమే ఇరిగేషన్ శాఖాధికారులతో సమీక్ష(Irrigation Review) నిర్వహించాలని బీజేపీ(Nizamabad BJP) జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్లోని (Nizamabad) ప్రజావాణిలో అడిషనల్ కలెక్టర్కు భుజంగరావుకు వినతిపత్రం అందజేశారు.
Dinesh Kulachari | ఆశించిన స్థాయిలో వర్షాల్లేక..
ప్రస్తుత వర్షాకాలంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడం వల్ల ఇందూరు జిల్లాలోని రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని దినేష్ అన్నారు. ఇప్పటికే లక్షల ఎకరాల్లో రైతులు వరి నాట్లు వేయగా, వర్షాలు లేకపోవడం, ప్రాజెక్టుల నుండి సాగునీరు సక్రమంగా అందకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా బాన్సువాడ, బోధస్ ప్రాంతాల్లో రైతులు ఇప్పటికే పెట్టుబడి పెట్టి నాట్లు వేసినప్పటికీ, నీటి లభ్యత లేక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. . జిల్లాలో చాలాచోట్ల రైతులు బోర్లపై ఆధారపడి వరి సాగు చేస్తున్నారని ఆయన అన్నారు. అయితే, వర్షాభావ పరిస్థితుల వల్ల భూగర్భ జలాలు అడుగంటి, బోర్లు ఎండిపోతున్నాయని పేర్కొన్నారు.
Dinesh Kulachari | సాగునీటిపై నిర్లక్ష్యం బాధాకరం..
ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో సాగునీటి నిర్వహణపై ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించకపోవడం బాధాకరమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం రైతులను ఆదుకునే దిశగా ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం పట్ల రైతులు ఆందోళన చెందుతున్నారని ఆయన అన్నారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఇరిగేషన్ శాఖాధికారులతో తక్షణమే అత్యున్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించి, నిజాంసాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం ఉన్న 6.5 టీఎంసీల నుండి, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం ఉన్న 15 టీఎంసీల నుండి సాగునీటిని ఏ మేరకు, ఎప్పటి నుండి విడుదల చేస్తారో రైతులకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. పంటల పరిస్థితిపై క్షేత్రస్థాయిలో అంచనా వేసి, ఎండిపోతున్న పంటలను కాపాడేందుకు తక్షణ కార్యాచరణను సిద్ధం చేయాలని.. రైతులు ఆందోళన చెందకుండా వారిని ఆదుకునేలా చొరవ చూపాలని ఆయన కోరారు.