అక్షరటుడే, వెబ్డెస్క్: Beekeeping Training | ములుగు జిల్లా (Mulugu District) తాడ్వాయి మండలం గొనెపల్లిలో మహిళా సాధికారత దిశగా సరికొత్త అడుగు పడింది. అడవి సంపదను కాపాడుకుంటూనే, సహజ సిద్ధమైన పద్ధతుల్లో జీవనోపాధిని పొందేలా మహిళలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) శ్రీకారం చుట్టారు. ‘ఇందిరా మహిళాశక్తి’ జీవనోపాధుల కార్యక్రమంలో భాగంగా, హంబుల్ బీ సంస్థ సహకారంతో మహిళా సంఘాలకు శాస్త్రీయ పద్ధతిలో తేనెటీగల పెంపకంపై ప్రత్యేక శిక్షణను ఆమె లాంఛనంగా ప్రారంభించారు.
Beekeeping Training | ప్రాకృతిక జీవనశైలి ప్రాముఖ్యత..
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నేటి ఆధునిక కాలంలో అలవాటైన ప్లాస్టిక్ ప్లేట్ల వినియోగం వల్ల క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధుల బారిన పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. పూర్వకాలపు జీవనశైలి నేడు బంగారంతో సమానమని పేర్కొన్న ఆమె, మోదుగ ఆకులు, ఇప్పపువ్వు, సహజ సిద్ధమైన తేనె వంటివి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని తెలిపారు. అడవిలో లభించే పండ్లు, ఆకులు సహజ ఔషధాలుగా పనిచేస్తాయని గుర్తుచేశారు.
Beekeeping Training | మహిళా సంఘాలకు ఆర్థిక భరోసా..
మహిళలు స్వయం ఉపాధి పొంది ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతో, ప్రజా ప్రభుత్వం వడ్డీ లేని రూ. 10 లక్షల రుణాలను అందిస్తోందని మంత్రి వివరించారు. గతంలో కొండపర్తి గ్రామంలో ఏర్పాటు చేసిన ఇప్పపువ్వు లడ్ల తయారీ కేంద్రం ద్వారా ఓ మహిళా సంఘం సభ్యురాలు సుమారు రూ. 5 లక్షల ఆదాయం సాధించారని, అదే స్ఫూర్తితో మహిళలందరూ ఆర్థికంగా రాణించాలని కోరారు. ఇప్పుడు ప్రారంభించిన తేనెటీగల పెంపకం శిక్షణను మహిళలు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Beekeeping Training | రైతులకు సూచన..

ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో రైతులు కేవలం వరి సాగుకే పరిమితం కాకుండా, ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని సీతక్క సూచించారు. పెసర్లు, కందులు, మొక్కజొన్న వంటి పంటలకు భవిష్యత్తులో మంచి మార్కెట్ డిమాండ్ ఉంటుందని, తద్వారా లాభాలు గడించవచ్చని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్, వివిధ శాఖల అధికారులు, స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు.
గోనెపల్లిలో తేనెటీగల పెంపకానికి మంత్రి సీతక్క శ్రీకారం pic.twitter.com/lyzoOXz86Q
— bhavaniprasadkatta (@bhavaniprahx) July 16, 2026
ఇది కూడా చదవండి..: Religious Teachings Schools | స్కూళ్లలో మతపరమైన బోధనలు.. యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్