అక్షరటుడే, వెబ్‌డెస్క్: PRRE Memo 2026 | పంచాయతీరాజ్ & గ్రామీణ ఉపాధి (PR&RE) శాఖ మినిస్టీరియల్ సిబ్బందికి సంబంధించిన కీలక మెమోను ప్రభుత్వం విడుదల చేసింది. Memo No.190/CPR&RE/C/2025, (16-07-2026) ద్వారా జిల్లా పరిషత్‌ల ప్రధాన కార్యనిర్వహణాధికారులకు (CEOలు) పలు సూచనలు జారీ చేసింది.
PRRE Memo 2026 | జీఓ 317 బాధిత ఉద్యోగుల సౌకర్యార్థం
ప్రభుత్వం ఇప్పటికే జీఓ 317, జీఓ 46 ప్రకారం జోనల్ వ్యవస్థను అమలు చేస్తుండగా, జీఓ 190 (16-09-2025) ద్వారా ఇంటర్ లోకల్ కేడర్ తాత్కాలిక బదిలీలు (Temporary Transfers), డిప్యుటేషన్‌లకు మార్గదర్శకాలను రూపొందించింది. తాజా మెమోలో ఆ మార్గదర్శకాల అమలుకు సంబంధించి తదుపరి చర్యలు చేపట్టాలని ఆదేశించింది.
మెమో ప్రకారం, ప్రతి జిల్లా పరిషత్ సీఈఓ తమ జిల్లాలోని అర్హత కలిగిన మినిస్టీరియల్ ఉద్యోగుల వివరాలను కేటగిరీల వారీగా సేకరించి ప్రభుత్వానికి పంపాల్సి ఉంటుంది. తమ ప్రస్తుత జోన్‌కు భిన్నమైన మరో జోన్ లేదా లోకల్ కేడర్‌లో తాత్కాలికంగా విధులు నిర్వహించేందుకు ఆసక్తి ఉన్న ఉద్యోగుల జాబితాను సిద్ధం చేయాలని సూచించింది.
PRRE Memo 2026 | క్లర్కులు, జూనియర్ అసిస్టెంట్లు..
ఈ ప్రక్రియ మండల పరిషత్ కార్యాలయాలు (MPP), జిల్లా పరిషత్ కార్యాలయాలు (ZPP), మండల పరిషత్ పాఠశాలల్లో పనిచేస్తున్న మినిస్టీరియల్ సిబ్బందికి వర్తిస్తుంది.
క్లర్కులు, జూనియర్ అసిస్టెంట్లు తదితర కార్యాలయ సిబ్బంది దీనివల్ల ప్రయోజనం పొందే అవకాశం ఉంది. అయితే ఈ నిబంధనలు బోధనా సిబ్బందికి (Teaching Staff) వర్తించవని మెమోలో స్పష్టం చేశారు.
జీఓ 317 అమల్లోకి వచ్చిన తర్వాత జోన్ల మధ్య శాశ్వత బదిలీలకు పరిమితులు ఏర్పడిన నేపథ్యంలో, అవసరమైన సందర్భాల్లో తాత్కాలిక డిప్యుటేషన్‌ల ద్వారా ఇతర జోన్లలో పనిచేసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లాల నుంచి అర్హులైన ఉద్యోగుల వివరాలు అందిన తర్వాత ప్రభుత్వం తదుపరి డిప్యుటేషన్ ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది.
అర్హత ఉన్న మినిస్టీరియల్ సిబ్బంది ఈ అంశంపై సంబంధిత జిల్లా పరిషత్ సీఈఓ కార్యాలయంలో వివరాలు తెలుసుకుని, అవకాశం కల్పించినప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు.