అక్షరటుడే, వెబ్‌డెస్క్: Telangana EHS GO 50 | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ Family సభ్యులకు నగదు రహిత అత్యుత్తమ వైద్య సేవలు అందించే లక్ష్యంతో అమలవుతున్న “ఉద్యోగుల హెల్త్ స్కీమ్ (EHS)” నిర్వహణపై ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది.
ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ (EHCT) ద్వారా ఈ పథకాన్ని మరింత పారదర్శకంగా, జవాబుదారీతనంతో సమర్థవంతంగా అమలు చేసేందుకు వీలుగా నూతన మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులను (G.O.Ms.No.50) రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జారీ చేశారు.
Telangana EHS GO 50 | 1.5% వాటా విరాళం అమలు
ట్రస్ట్ బోర్డు పునర్వ్యవస్థీకరణ – 1.5% వాటా విరాళం అమలు
ఈ తాజా ఉత్తర్వుల ప్రకారం, ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల ప్రతినిధులు, రిటైర్డ్ ఉద్యోగులు (పెన్షనర్లు) సంఘాల ప్రతినిధులతో కూడిన “ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ (EHCT)” బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ అధికారికంగా పునర్వ్యవస్థీకరించబడింది.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ప్రాథమిక వేతనం (Basic Pay), ప్రాథమిక పెన్షన్ (Basic Pension) నుంచి సేకరిస్తున్న 1.5% నెలవారీ ఈహెచ్ఎస్ (EHS) విరాళాన్ని సమర్థవంతంగా నిర్వహించే బాధ్యతను ఈ సరికొత్త ట్రస్ట్‌కు ప్రభుత్వం అప్పగించింది.
Telangana EHS GO 50 | బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ కీలక బాధ్యతలు – అధికారాలు
ఉద్యోగుల హెల్త్ కేర్ ట్రస్ట్ బోర్డు పరిధిని స్పష్టం చేస్తూ ప్రభుత్వం నిర్దేశిత మార్గదర్శకాలను జీవోలో పేర్కొంది:
పూర్తి పర్యవేక్షణ అధికారాలు: ఇకపై ఈహెచ్ఎస్ (EHS) పథకం యొక్క పూర్తిస్థాయి అమలు, పరిపాలన, నిర్వహణ, పనుల సమన్వయ అధికారాలు అన్నీ ఈ నూతన బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ పరిధిలోనే ఉంటాయి.
నిధుల కచ్చితమైన వినియోగం: ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి సేకరిస్తున్న ఈ నిధులను ట్రస్ట్ డీడ్, నిర్దేశిత నియమావళి, ప్రభుత్వ మార్గదర్శకాలకు లోబడి కేవలం సభ్యులైన ఉద్యోగులు, రిటైర్డ్ సిబ్బంది, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యుల అత్యవసర వైద్య ఖర్చుల కోసమే కచ్చితంగా వినియోగించాలి.
పారదర్శకత – జవాబుదారీతనం: నిధుల నిర్వహణ, చెల్లింపుల ప్రక్రియలో అత్యున్నత పారదర్శకతను, చట్టపరమైన నిబంధనలను నూటికి నూరు శాతం పాటించాల్సి ఉంటుంది.
Telangana EHS GO 50 | మెరుగైన వైద్య సేవలు!
ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో హెల్త్ కార్డుల ద్వారా ఉద్యోగులకు అందే కార్పొరేట్ వైద్య సేవల్లో జాప్యం తొలగిపోతుందని, ట్రస్టులో ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు భాగస్వామ్యం లభించడం వల్ల పథకంలో ఎదురవుతున్న క్లెయిమ్‌ల సమస్యలకు వేగంగా పరిష్కారం లభిస్తుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.