అక్షరటుడే, కామారెడ్డి: Disha Meeting | మూణ్నెళ్లకొకసారి నిర్వహించే దిశ సమావేశం వాడీవేడిగా సాగింది. కలెక్టరేట్(Kamareddy) సమావేశ మందిరంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్(MP Suresh Shetkar) అధ్యక్షతన ఈ మీటింగ్ నిర్వహించారు.
Disha Meeting | శాఖల వారీగా..
శాఖల వారీగా సమీక్షలో అధికారుల పనితీరుపై చర్చ హాట్‌హాట్‌గా జరిగింది. వ్యవసాయ శాఖపై సమీక్ష సందర్భంగా రైతుల సమస్యలపై ప్రధానంగా చర్చించారు. రైతులకు క్రాప్ లోన్లు, రైతు భరోసా, రైతు భీమా అంశాలపై ఎమ్మెల్సీ అంజిరెడ్డి(MLC Anji Reddy) అధికారులను ప్రశ్నించారు. ఈ-నామ్ రిజిస్ట్రేషన్లు ఎంతవరకు పూర్తయ్యాయని ప్రశ్నించారు. జిల్లాలో ఇంప్రూవ్‌మెంట్ లేదని అధికారులు చెప్పడంతో రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రైతులు వరి పంటకు బదులు ఆరుతడి పంటలు పండించేలా అవగాహన కల్పించాలని ఎంపీ సురేష్ షెట్కార్ అన్నారు.
ఆయిల్ పామ్ సాగుపై రైతులకు వివరించి సాగును పెంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గత ఏడాది 2500 ఎకరాల్లో ఆయిల్ పామింగ్ ప్లాంటేషన్ పూర్తయిందని, ఈ ఏడాది 1300 ఎకరాలు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇప్పటికే 286 ఎకరాల్లో ప్లాంటేషన్ పూర్తయిందని హార్టికల్చర్ అధికారి జ్యోతి తెలిపారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ, ప్లాంటేషన్ ఖర్చులు, వచ్చే లాభాలను వివరంగా తెలియజేయాలని ఎంపీ, ఎమ్మెల్సీ సూచించారు.
Disha Meeting | ఇరిగేషన్ అధికారుల తీరుపై ఎంపీ సీరియస్..
ఇరిగేషన్ అధికారుల తీరుపై ఎంపీ సీరియస్ అయ్యారు. పనులకు సంబంధించిన ప్రతిపాదనలు పంపకుండా నిధులు ఎలా మంజూరవుతాయని ప్రశ్నించారు. జాతీయ రహదారుల అంశంపై అరగంటకు పైగా చర్చించారు. జిల్లాలో రహదారుల పనులు మందకొడిగా సాగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రిడ్జి నిర్మాణాల వద్ద కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదని ఎస్పీ రాజేష్ చంద్ర చెప్పారు. రాత్రి వేళల్లో చీకటి కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. బిక్కనూర్ టోల్ ప్లాజా వద్ద ఒక వాహనం ఒక నిమిషంలో వెళ్లాలన్న నిబంధన అమలు కావడం లేదని ఎమ్మెల్సీ అంజిరెడ్డి అన్నారు. తాను వస్తుండగా కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయని, సంబంధిత టోల్ ప్లాజాపై చర్యలు తీసుకోవాలని కోరారు.
జాతీయ రహదారిపై యాక్సిడెంట్ జరిగి ఒక వ్యక్తి చనిపోయినా అధికారులు స్పందించలేదని ఎస్పీ తెలిపారు. గ్రామీణాభివృద్ధి శాఖపై చర్చలో ఎన్‌ఆర్‌ఈజీఎస్ పేరు మార్పిడి తర్వాత బిల్లుల మంజూరుకు ఇబ్బందులు ఉంటాయా అని ఎంపీ అడిగగా అలాంటిదేమీ ఉండదని అధికారులు చెప్పారు. గ్రామీణ ప్రాంతాలకు రహదారుల నిర్మాణంపై ప్రతిపాదనలు ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 500 మీటర్ల నిబంధన మాత్రమే ఉందని అధికారులు చెప్పగా, సంగారెడ్డిలో కిలోమీటర్ ఉన్నా మంజూరైందని ఎంపీ గుర్తు చేశారు. అమృత్ స్కీం కింద తాగునీటి సరఫరా పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. డిసెంబర్ లోపు పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు.
Disha Meeting | కామారెడ్డి మున్సిపాలిటీకి..
కామారెడ్డి మున్సిపాలిటీకి ప్రస్తుతం 10 ఎంఎల్‌డి తాగునీరు సరఫరా అవుతోందని, మరో 6 ఎంఎల్‌డి పనులు చేపడుతున్నామని, అవి పూర్తయితే 2038 వరకు తాగునీటి కొరత ఉండదని అధికారులు వివరించారు. వైద్య ఆరోగ్యశాఖపై సమీక్షలో ప్రతి పేషంట్ వివరాలు డిజిటలైజ్ చేస్తున్నారా అని ఎమ్మెల్సీ అంజిరెడ్డి ప్రశ్నించారు. డిజిటల్ చేయడం లేదని అధికారులు చెప్పడంతో దానివల్ల ప్రజలకు ఉపయోగం ఉంటుందని, పక్కాగా అమలు చేయాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల కంటే ప్రైవేట్ ఆస్పత్రుల్లో గర్భిణులకు ఆపరేషన్లు ఎక్కువగా జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసి తక్షణ చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులకు ఆదేశించారు. గాంధారి ఆస్పత్రి శిథిలావస్థకు చేరిందని, కొత్త భవనానికి ప్రతిపాదనలు పంపితే సంబంధిత మంత్రితో తాను మాట్లాడతానని ఎంపీ హామీ ఇచ్చారు.
Disha Meeting | ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లతో కుమ్మక్కు
ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లతో కుమ్మక్కై ప్రభుత్వ ఆస్పత్రి నుంచి రిఫర్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో వైద్యులు లేని ఏకైక ఆస్పత్రి బిచ్కుంద అని ఎంపీ చెప్పారు. విద్యాశాఖపై చర్చిస్తూ ప్రతి పాఠశాలలో మధ్యాహ్న భోజనానికి ఏడాదికి ఆరు సిలిండర్లు అందేలా ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయని, వాటిని అమలు చేయాలని ఎమ్మెల్సీ సూచించారు. లీడ్ బ్యాంక్ శాఖపై సమీక్షలో ఆర్బీఐ నిబంధనల ప్రకారం ప్రతి గ్రామంలో బ్యాంక్ ఉండాలని ఎమ్మెల్సీ అంజిరెడ్డి అన్నారు.
జిల్లాలో 532 గ్రామాలు ఉంటే 140 బ్యాంకులు మాత్రమే ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే సమావేశానికి అన్ని గ్రామాల్లో బ్యాంకింగ్ సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి, ప్రధానమంత్రి సురక్ష యోజన ఎంతమందికి చేశారని అడిగారు. ప్రతి ఖాతాదారుడికి ఈ పథకాలపై అవగాహన కల్పించాలన్నారు. ప్రతి ఏడాది వెయ్యి మందికి శిక్షణ ఇవ్వాలన్న ఆదేశాలపై ఆరా తీశారు. వ్యవసాయానికి ప్రత్యేక ప్రతిపాదనలు తయారు చేయాలని, రైతులకు రుణాలు ఇవ్వని బ్యాంకులపై చర్యలు తీసుకోవాలన్నారు. కామారెడ్డిలో వరదలు వచ్చినప్పుడు ఎంత మేరకు సహకరించారని అడిగారు. మీ వద్ద ఎన్ని కోట్లు నిధులు ఉన్నాయని ప్రశ్నించగా రూ.98 కోట్లు ఉన్నాయని చెప్పడంతో ఎమ్మెల్సీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు వంద కోట్లు వద్ద ఉంచుకుని కనీసం ఎమ్మెల్యేలు, ఎంపీకి సమాచారం ఇవ్వరా అని ప్రశ్నించారు. వెంటనే కలెక్టర్, ఎంపీ, ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశమై పనులకు నిధులు కేటాయించాలని ఆదేశించారు.
ముగ్గురు ఎమ్మెల్యేల డుమ్మా
జిల్లా స్థాయి దిశ సమావేశంలో పాల్గొని పలు శాఖల పనితీరుపై సమీక్షించాల్సిన ముగ్గురు ఎమ్మెల్యేలు సమావేశానికి డుమ్మా కొట్టారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంత్ రావులు సమావేశానికి గైర్హాజరయ్యారు. ఈ సమావేశంలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, మున్సిపల్ ఛైర్పర్సన్లు ఇప్ప ఉమారాణి, శ్రీకాంత్, సీమా షెట్కార్ పాల్గొన్నారు.