అక్షరటుడే వెబ్‌డెస్క్: Priyanka Gandhi | దేశంలో విద్యా విధానంలోని లోపాలు , ప్రశ్నాపత్రాల లీకేజీలకు నిరసనగా పార్లమెంట్ ( Parliament )ముట్టడికి యత్నించిన విద్యార్థులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి, లాఠీఛార్జ్ చేయడంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభ రోజే జరిగిన ఈ ఘటన ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని ఆమె విమర్శించారు.
Priyanka Gandhi | విద్యార్థులపై దౌర్జన్యం ..
పార్లమెంట్ ప్రాంగణంలో మీడియానుద్దేశించి మాట్లాడిన ప్రియాంక గాంధీ, విద్యార్థులు దేశ భవిష్యత్తు అని, వారి గొంతును అణచివేయడం సరికాదని స్పష్టం చేశారు. “ఈ పార్లమెంట్ ప్రజాస్వామ్యానికి ప్రతీక. ఇది ఎవరి వ్యక్తిగత ఆస్తి కాదు, ఇది విద్యార్థులది కూడా. సమస్యలపై శాంతియుతంగా చర్చించాల్సింది పోయి, వారిపై టియర్ గ్యాస్ ప్రయోగించడం, లాఠీలతో దాడి చేయడం అత్యంత దారుణం” అని ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు. విద్యా రంగంలోని సమస్యలపై రాహుల్ గాంధీ ఎప్పటి నుంచో పోరాడుతున్నారని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు.
Priyanka Gandhi | ఢిల్లీలో ఉద్రిక్తత..
కాక్‌రోచ్ జనతా పార్టీ (సీజేపీ) పిలుపు మేరకు విద్యార్థులు, నిరసనకారులు పెద్ద ఎత్తున పార్లమెంట్ మార్చ్‌కు తరలివచ్చారు. నిరసనకారులు బారికేడ్లను దాటుకుని సెంట్రల్ ఢిల్లీలోకి వచ్చేందుకు యత్నించగా, పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పటేల్ చౌక్, శాస్త్రి భవన్, పార్లమెంట్ స్ట్రీట్ ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బలప్రయోగంలో పలువురు విద్యార్థులు, పోలీసులకు గాయాలయ్యాయి. శాంతిభద్రతల దృష్ట్యా ఆయా ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసినట్లు సమాచారం.
Priyanka Gandhi |పార్లమెంట్‌లోనూ నిరసన సెగ..
విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జ్ వ్యవహారంపై ఉభయ సభల్లోనూ విపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. ప్రభుత్వం స్పందించాలని కోరుతూ సభ్యులు ఆందోళన చేపట్టడంతో పార్లమెంట్ కార్యకలాపాలు పలుమార్లు వాయిదా పడ్డాయి. విద్యార్థుల సమస్యలను పరిష్కరించే బదులు, వారిని అణచివేయడం ఏంటని విపక్ష నేతలు కేంద్రాన్ని ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: TSRTC Welfare | త్వరలో ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం.. మంత్రి పొన్నం కీలక ప్రకటన