Jeevan Reddy Comments | కాంగ్రెస్ నియంతృత్వ పాలనపై ప్రజలే తగిన బుద్ధి చెబుతారు: జీవన్ రెడ్డి

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, ప్రజల హక్కులను కాలరాస్తోందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి జీవన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Jeevan Reddy Comments | తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, ప్రజల హక్కులను కాలరాస్తోందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి జీవన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో వందలాది మంది నాయకులు, కార్యకర్తలు, మహిళలతో కలిసి తెలంగాణ భవన్ నుంచి తహసీల్ చౌరస్తా వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసిల్ చౌరస్తా వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించి, రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు.

Jeevan Reddy Comments | గ్యారెంటీల పేరుతో మోసం..

ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ 420 హామీలు, 13 డిక్లరేషన్లు, 6 గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. అధికారంలోకి వచ్చాక రైతు భరోసా, కౌలు రైతుల సహాయం, నిరుద్యోగ భృతి, ఉద్యోగాలు, విద్యాభరోసా, ఫీజు బకాయిల చెల్లింపులు, పింఛన్ల పెంపు వంటి ఏ ఒక్క హామీని కూడా సక్రమంగా అమలు చేయలేదని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు పోలీసులను అడ్డుపెట్టుకుని నియంతృత్వ పాలన సాగిస్తోందని విమర్శించారు.

Jeevan Reddy Comments | హక్కుపై కక్షసాధింపు..

గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ శ్రేణులు శాంతియుతంగా చేపడుతున్న నిరసనలపై కాంగ్రెస్ సర్కార్ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పట్ల, ముఖ్యంగా మహిళా ప్రజాప్రతినిధుల పట్ల అధికార పక్షం, పోలీసులు దురుసుగా వ్యవహరించడం దారుణమన్నారు. అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు మహాభారతంలోని కౌరవ సభను తలపించిందని, ఇది రాష్ట్రంలోని మహిళా లోకానికే పెద్ద అవమానమని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ‘నిరసన తెలిపే హక్కు’ను ఏడో గ్యారెంటీగా చెప్పిన కాంగ్రెస్, నేడు అధికారంలోకి వచ్చాక అదే హక్కును కాలరాస్తూ ప్రజాస్వామ్య సూత్రాలను తుంగలో తొక్కుతోందని విమర్శించారు. రాజ్యాంగ స్ఫూర్తిని విస్మరిస్తున్న ఈ ప్రభుత్వానికి ప్రజలు త్వరలోనే తగిన గుణపాఠం చెబుతారని, ఉద్యమాల గడ్డ జగిత్యాల నుంచే ‘రేవంత్  (  Revanth Reddy )పోవాలి.. కేసీఆర్ రావాలి’ అనే నినాదం నిజమవుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి:  Gampa Govardhan Protest | రేవంత్​రెడ్డికి మహిళల ఉసురు తగులుతుంది : మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *