అక్షరటుడే, వెబ్‌డెస్క్: CJP Protest Cases | ఢిల్లీ (Delhi)లోని జంతర్‌మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసన కొనసాగుతోంది. సోమవారం హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడంతో పోలీసులు పలువురిపై కేసు నమోదు చేశారు.
సీజేపీ ఆధ్వర్యంలో సోమవారం చలో పార్లమెంట్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. ప్రభుత్వ వాహనాలను ధ్వంసం చేశారు. దీంతో ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. పార్లమెంట్ సమావేశాల సమయంలో అనుమతి లేకుండా డ్రోన్ ఎగురవేసినందుకు ఒక ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. హింసను ప్రేరేపించడానికి కుట్ర పన్నినందుకు మరొకటి ఫైల్ చేశారు. మిగిలిన రెండు ఎఫ్‌ఐఆర్‌లు ప్రభుత్వ పనులకు ఆటంకం కలిగించడం, పోలీసు సిబ్బందిపై దాడి చేయడం మరియు ఆస్తి నష్టం కలిగించినందుకు నమోదు చేశారు.
CJP Protest Cases | నిందితుల గుర్తింపు
సీసీటీవీ ఫుటేజ్, వీడియో రికార్డింగ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ ఆధారాల ద్వారా ఆందోళనలో పాల్గొన్న వారిని పోలీసులు గుర్తిస్తున్నారు. ఇప్పటికే పలువురిని గుర్తించారు. సోమవారం నాటి హింసాకాండపై దర్యాప్తు కొనసాగుతోందని, విధ్వంసం, పోలీసు సిబ్బందిపై దాడి, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించిన వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. కాగా సోమవారం ఆందోళన సమయంలో జరిగిన హింసలో 118 మందికి పైగా ఢిల్లీ పోలీసు సిబ్బంది, 60 మంది నిరసనకారులు గాయపడ్డారు.
CJP Protest Cases | కొనసాగుతున్న నిరసనలు
నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సీజేపీ డిమాండ్ చేస్తోంది. అప్పటి వరకు ఆందోళన కొనసాగిస్తామని పేర్కొంది. దీంతో మంగళవారం సైతం జంతర్‌మంతర్ వద్ద ఆందోళన చేపట్టారు. న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. నిరసనకారులపై చేపట్టిన కఠిన చర్యలను CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే తీవ్రంగా విమర్శించారు. మరోవైపు ఢిల్లీలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. వ్యూహాత్మక ప్రాంతాల్లో బహుళ అంచెల బారికేడ్లను ఏర్పాటు చేశారు. వాహనాల తనిఖీలను పెంచారు. కీలకమైన ప్రభుత్వ భవనాలు, ప్రధాన కూడళ్లు, నిరసనలకు ఆస్కారం ఉన్న ప్రాంతాల వద్ద అదనపు బలగాలను మోహరించారు.
ఇది కూడా చదవండి..: Goods Train Derailment | పట్టాలు తప్పిన గూడ్స్.. పలు రైళ్ల రద్దు..