Supreme Court Remarks | సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీలో ఆందోళనకారులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారని దాఖలైన పిటిషన్​పై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Supreme Court Remarks | ఢిల్లీలో కాక్రోచ్​ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. నిరసనకారులపై జరిగిన అణచివేత సందర్భంగా పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌పై అత్యవసరంగా విచారణకు సుప్రీంకోర్టు బుధవారం నిరాకరించింది. వీడియోలను సమర్పించి కోర్టు సమయాన్ని “వృథా” చేయవద్దని సీజేఐ సూర్యకాంత్ పిటిషనర్‌కు సూచించారు.

సీజేపీ ఆధ్వర్యంలో జంతర్​మంతర్​ వద్ద నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. సోమవారం నిరసనకారులు పార్లమెంట్​ ముట్టడికి పిలుపునివ్వగా.. పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో లాఠీచార్జీ చోటు చేసుకుంది. ఈ విషయంపై అత్యవసర విచారణ చేపట్టాలని ఓ న్యాయవాది కోర్టును ఆశ్రయించారు. దీనిపై సీజేఐ సూర్యకాంత్​ ఆధ్వర్యంలో ధర్మాసనం విచారణ చేపట్టింది. “మా సమయాన్ని వృథా చేయవద్దు, మీ సమయాన్ని కూడా వృథా చేసుకోకండి,” అని సీజేఐ ఆ న్యాయవాదితో అన్నారు.

Supreme Court Remarks | వీడియోలపై ఆసక్తి లేదు

నీట్ పరీక్ష (NEET Exam) నిర్వహణ, ఎన్‌టీఏలో సంస్కరణలు వంటి లక్షలాది మంది విద్యార్థులను ప్రభావితం చేసే సమస్యలపైనే ఈ నిరసనలు కేంద్రీకృతమై ఉన్నాయని న్యాయవాది పేర్కొన్నారు. ఆయన వాదనను మధ్యలోనే ఆపేస్తూ.. జస్టిస్‌ జయమల్య బాగ్చీ, వి. మోహన కూడా సభ్యులుగా ఉన్న ధర్మాసనం, “మీకు చాలా ధన్యవాదాలు” అని బదులిచ్చింది. నిరసనకారులపై పోలీసు సిబ్బంది దాడి చేస్తున్నట్లుగా ఉన్న వీడియోలను సమర్పిస్తామని న్యాయవాది చెప్పగా.. “మాకు వీడియోలపై ఆసక్తి లేదు. వాటిని చూడటానికి మాకు సమయం లేదు,” అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కాగా ఇదే విషయమై దాఖలైన పిటిషన్​ను అత్యవసరంగా విచారించడానికి మంగళవారం ఢిల్లీ హైకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే.

దీనిని కూడా చదవండి : Parliament Protest | పార్లమెంట్ వద్ద ప్రతిపక్షాల నిరసన

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.