Bike Taxi Rules | బైక్ టాక్సీల నియంత్రణకు ఏకీకృత చట్రం అవసరం.. కట్స్ ఇంటర్నేషనల్ నివేదిక

గిగ్ వర్కర్ల జీవనోపాధిని పరిరక్షించడానికి, ప్రయాణికుల భద్రతను నిర్ధారించడానికి బైక్ టాక్సీల కోసం ఒక ఏకీకృత నియంత్రణ చట్రం ఎంతో అవసరమని 'కట్స్ (CUTS) ఇంటర్నేషనల్' తన కొత్త నివేదికలో స్పష్టం చేసింది.

Shivam nagarani

అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bike Taxi Rules | గిగ్ వర్కర్ల ( Gig Workers ) జీవనోపాధిని పరిరక్షించడానికి, ప్రయాణికుల భద్రతను నిర్ధారించడానికి , ఫస్ట్, లాస్ట్-మైల్ కనెక్టివిటీని మెరుగుపరచడానికి దేశంలో బైక్ టాక్సీల కోసం ఒక ఏకీకృత, సాక్ష్యాధారిత నియంత్రణ చట్రం ఎంతో అవసరమని ‘కట్స్ (CUTS) ఇంటర్నేషనల్’ తన కొత్త నివేదికలో స్పష్టం చేసింది. “భారతదేశంలో బైక్ టాక్సీ నిబంధనలను ఏకీకృతం చేయడం- సాక్ష్యాధారిత అంచనా , సంస్కరణలకు సూచించిన మార్గాలు” అనే ఈ నివేదికను న్యూఢిల్లీలో బీజేపీ జాతీయ ఆర్థిక వ్యవహారాల అధికార ప్రతినిధి గోపాల్ కృష్ణ అగర్వాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమీకృత రవాణా పర్యావరణ వ్యవస్థ దేశంలో కనెక్టివిటీ, ఉపాధి , సుస్థిర వృద్ధికి కీలకమని పేర్కొన్నారు.

Bike Taxi Rules | పట్టణ రవాణాలో కీలక పాత్ర

భారతదేశ పట్టణ రవాణా వ్యవస్థలో బైక్ ట్యాక్సీలు ఒక ముఖ్యమైన భాగంగా ఆవిర్భవించాయని నివేదిక తెలిపింది. స్వల్ప-దూర ప్రయాణాలకు, మెట్రో, బస్ నెట్‌వర్క్‌లకు పూరకంగా ఉంటూ ఫస్ట్-మైల్, లాస్ట్-మైల్ కనెక్టివిటీ అంతరాలను పరిష్కరించడంలో ఇవి ఎంతగానో సహాయపడుతున్నాయని పేర్కొంది. అద్దెకు ఉపయోగించే మోటార్‌సైకిళ్లకు మోటార్ వెహికల్స్ యాక్ట్, 1988 ప్రకారం చట్టపరమైన ఆధారం ఉందని, రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ జారీ చేసిన అగ్రిగేటర్ గైడ్‌లైన్స్ వీటికి మార్గనిర్దేశం చేస్తున్నాయని నివేదిక వెల్లడించింది. అయితే, ఢిల్లీ, కేరళ, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు వంటి రాష్ట్రాలు విభిన్న విధానాలను అవలంబించడం వల్ల నిబంధనల పాటింపు భారం పెరిగి కార్మికుల్లో అనిశ్చితి నెలకొందని తెలిపింది.

Bike Taxi Rules | తక్కువ ఖర్చుతో ప్రయాణం..

ఆటో-రిక్షాలకు కిలోమీటరుకు రూ.15–18, సాధారణ టాక్సీలకు రూ.22–25 ఖర్చవుతుండగా.. బైక్ టాక్సీలకు కేవలం రూ.8–10 మాత్రమే ఖర్చవుతుందని నివేదిక పేర్కొంది. ఇది విద్యార్థులు, యువ నిపుణులు, అసంఘటిత కార్మికులకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని తెలిపింది. అలాగే, నిర్వహణ ఖర్చులు పోను బైక్ టాక్సీ ఆపరేటర్లు నెలకు రూ.25,000–30,000 వరకు నికర ఆదాయం సంపాదించే అవకాశం ఉందని తెలిపింది. పూర్తిస్థాయి నిషేధాలు లేదా ఆంక్షల వల్ల రద్దీ తగ్గకపోగా, కార్మికుల జీవనోపాధి తీవ్రంగా దెబ్బతింటుందని నివేదిక హెచ్చరించింది. అలాగే, విద్యుదీకరణను (EV) పూర్తిగా సమర్థిస్తున్నప్పటికీ.. తగిన ఛార్జింగ్ మౌలిక వసతులు లేకుండా ఇంధన వాహనాలను తక్షణమే మినహాయించకుండా, దశలవారీగా ప్రోత్సాహకాల ద్వారా ఈవీ పరివర్తనను సాధించాలని సూచించింది.

Bike Taxi Rules | కీలక సిఫార్సులు..

పూర్తిస్థాయి నిషేధాలు మాని, బైక్ ట్యాక్సీ కార్యకలాపాలకు వ్యవస్థీకృత అధికారిక అనుమతులు ఇవ్వాలి. నోటిఫైడ్ రాష్ట్ర పథకాల ద్వారా 2025 మోటార్ వెహికల్ అగ్రిగేటర్ మార్గదర్శకాలను అమలుపరచాలి. రవాణాేతర మోటార్‌సైకిళ్లను నిర్దిష్ట భద్రత, బీమా నిబంధనలతో అగ్రిగేషన్ చేయడానికి అనుమతించాలి. ప్రైవేట్ బైక్‌లను శాశ్వతంగా వాణిజ్య వాహనాలుగా మార్చడాన్ని తప్పనిసరి చేయకుండా, ప్లాట్‌ఫారమ్-అధీకృత వినియోగ నమూనాను అమలు చేయాలి. డ్రైవర్లు , ప్రయాణికులకు ఆరోగ్య, ప్రమాద బీమా, హెల్మెట్ తప్పనిసరి చేయడం, పారదర్శక ఛార్జీల విధానాలను పాటించాలి. ఈ ప్రారంభోత్సవంలో జాతీయ రహదారి భద్రతా బోర్డు ఛైర్మన్ నితిన్ ఆర్. గోకర్ణ్ ప్రత్యేక అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

ఇది కూడా చదవండి:  REDCO DE | రెడ్కో డీఈ నివాసాల్లో ఏసీబీ సోదాలు.. భార్య పేరిట భారీగా ఆస్తులు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *