అక్షరటుడే వెబ్‌డెస్క్: India Seafood Exports | భారతదేశ సీఫుడ్ ఎగుమతుల అభివృద్ధి, నాణ్యత ప్రమాణాలు, ఎగుమతుల మౌలిక వసతులు, అలాగే ట్రేసబిలిటీ (Traceability) వ్యవస్థల అమలుపై పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కేంద్ర ప్రభుత్వాన్ని వివరణ కోరారు.
India Seafood Exports | గత ఐదేళ్లలో..
కేంద్ర మత్స్య, పశుసంవర్ధక , పాడి పరిశ్రమల మంత్రిత్వ శాఖను ప్రశ్నిస్తూ, గత ఐదేళ్లలో దేశవ్యాప్తంగా చేపల ఎగుమతుల పరిమాణం, విలువ, ఎగుమతుల మౌలిక వసతుల అభివృద్ధికి కేటాయించిన నిధులు, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యత నియంత్రణ చర్యలు, అలాగే ఎగుమతుల నాణ్యతను మరింత మెరుగుపరిచేందుకు ట్రేసబిలిటీ వ్యవస్థల అమలుపై వివరాలు కోరారు. ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ, 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్ 19.72 లక్షల మెట్రిక్ టన్నుల సీఫుడ్‌ను రూ.67,389.81 కోట్ల విలువతో ఎగుమతి చేసినట్లు వెల్లడించింది.
India Seafood Exports | వేల కోట్ల రూపాయలతో పలు ప్రాజెక్టులు..
అలాగే, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (PMMSY) కింద దేశవ్యాప్తంగా చేపల ప్రాసెసింగ్, కోల్డ్ స్టోరేజ్, ఎగుమతుల మౌలిక వసతుల అభివృద్ధికి వేల కోట్ల రూపాయలతో పలు ప్రాజెక్టులు అమలు చేస్తున్నట్లు తెలిపింది. MPEDA ద్వారా విలువ ఆధారిత ఉత్పత్తులు, ప్రాసెసింగ్, నిల్వ సదుపాయాల అభివృద్ధికి కూడా ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు వెల్లడించింది. అంతర్జాతీయ ఆహార భద్రత ప్రమాణాలకు అనుగుణంగా EIC, MPEDA, Coastal Aquaculture Authority వంటి సంస్థల ద్వారా నాణ్యత తనిఖీలు, సర్టిఫికేషన్, అవశేషాల పర్యవేక్షణ, ఎగుమతి ప్రమాణాల అమలు చేపడుతున్నట్లు కేంద్రం పేర్కొంది.
అదేవిధంగా, 2025లో జాతీయ ట్రేసబిలిటీ ఫ్రేమ్‌వర్క్‌ను విడుదల చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ వ్యవస్థ ద్వారా చేపల ఉత్పత్తి నుంచి ఎగుమతి వరకు పూర్తి సమాచారాన్ని డిజిటల్‌గా నమోదు చేసి, అంతర్జాతీయ మార్కెట్లలో భారత సీఫుడ్‌పై విశ్వసనీయతను మరింత పెంచే లక్ష్యంతో చర్యలు చేపడుతున్నట్లు తెలిపింది.
ఇది కూడా చదవండి: REDCO DE | రెడ్కో డీఈ నివాసాల్లో ఏసీబీ సోదాలు.. భార్య పేరిట భారీగా ఆస్తులు