Government Schools | సర్కారు వర్సెస్​ ప్రైవేటు స్కూళ్లు.. సందిగ్ధంలో విద్యార్థుల తల్లిదండ్రులు

ప్రభుత్వ పాఠశాలల బలోపేతంపై నీలినీడలు అలుముకుంటున్నాయి.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి : Government Schools | ప్రభుత్వ పాఠశాలల బలోపేతంపై నీలినీడలు అలుముకుంటున్నాయి. ఓవైపు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషి చేస్తుండగా మరోవైపు వాటి అభివృద్ధికి కృషి చేస్తున్న వారిని బైండోవర్ చేయడం చర్చనీయాంశంగా మారుతోంది. ఈ క్రమంలో తమ పిల్లలను ప్రైవేటులో చేర్చాలా..? ప్రభుత్వ పాఠశాలలో చేర్చాలా అనే సందిగ్ధంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారు. దాంతో జిల్లాలో ఈ అంశంపై తీవ్ర చర్చ సాగుతోంది.

Government Schools | గణనీయంగా పెరిగిన విద్యార్థులు..

గతేడాది కంటే ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. పలు పాఠశాలల ఉపాధ్యాయులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందారు. గతంలో కంటే విద్యార్థుల సంఖ్య పెరగడంతో రాష్ట్రంలో కామారెడ్డి జిల్లా (Kamareddy District) మూడో స్థానంలో నిలిచింది. అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు భవిష్యత్తును వేలెత్తి చూపేలా చేస్తున్నాయన్న టాక్ వినిపిస్తోంది.

Government Schools | తల్లిదండ్రుల్లో సందిగ్ధం..

గ్రామీణ ప్రాంతాల్లో గతంలో ప్రభుత్వ పాఠశాలలు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా అందులోనే తమ పిల్లలను చేర్చి చదివించేవారు. రానురాను పిల్లల భవిష్యత్తుపై తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి సారించడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో రోజు కూలీ చేసి అయినా తమ బిడ్డ బాగా చదువుకోవాలి అని రూ.వేలల్లో ఫీజులు చెల్లించి ప్రైవేట్ పాఠశాలలకు పంపిస్తున్నారు. దాంతో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్ కంటే విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. ఇటీవల ప్రజల్లో అక్కడక్కడా మార్పు రావడం, ప్రభుత్వ పాఠశాలల్లో సైతం ర్యాంకులు రావడంతో విద్యార్థుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ వస్తోంది. ఇటీవల ప్రతి గ్రామంలో ప్రైవేట్ పాఠశాలల బస్సులు మా గ్రామంలోకి రావద్దు అనే తీర్మానాలు పెరిగి పోవడంతో కొందరు తల్లిదండ్రుల్లో తమ పిల్లలను ఎక్కడ చదివించాలి అనే విషయంపై సందిగ్ధం నెలకొంది.

Government Schools | ప్రత్యేకంగా తీర్మానాలు

పలు గ్రామాల్లో ప్రజలు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే చదివించాలని.. ప్రైవేటు బస్సులు గ్రామాల్లోకి రావడాన్ని నిషేధించాలని తీర్మానాలు చేయడం కనిపించింది. అంతేకాకుండా పలువురు గ్రామస్తులు, సర్పంచులు ఆ తీర్మానాన్ని పక్కాగా అమలు చేయడం మొదలుపెట్టారు. దాంతో ప్రభుత్వ ఆ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది.

Government Schools | తీర్మానాలపై ఆగ్రహం

కొన్ని గ్రామాల్లో ఈ తీర్మానాలను కొందరు తల్లిదండ్రులు వ్యతిరేకిస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది. తమ పిల్లలను ఎక్కడ చదివించాలి అనేది నిర్ణయించడానికి మీరెవరు అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేటులో ఉన్నట్టుగా సౌకర్యాలు ఉన్నాయా..? ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారా..? ఆంగ్ల భాషలో పట్టు సాధిస్తారని నమ్మకం ఇస్తారా..? అని ప్రశ్నిస్తున్నారు.

Government Schools | పోలీసులకు ఫిర్యాదు.. సర్పంచ్ బైండోవర్

కొన్ని ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థుల తల్లిదండ్రులకు ఆఫర్లు ప్రకటిస్తూ తమవైపు లాక్కునేందుకు ప్రణాళిక రచిస్తున్నారన్న ప్రచారం ఇటీవల జోరందుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చేరితే ప్రైవేట్ పాఠశాలల పరిస్థితి ఏమిటో అర్థం కాని పరిస్థితుల్లో ఇలాంటి జిమ్మిక్కులు వాడుతున్నట్టుగా ప్రచారం సాగుతోంది. తాడ్వాయి మండలం కన్కల్ గ్రామంలో విద్యార్థుల తల్లిదండ్రులు కొందరు ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. అంతటితో ఆగకుండా తహశీల్దార్ ముందు సర్పంచ్​ను బైండోవర్ చేయడం దుమారం రేపింది.

Government Schools | పాఠశాలలు బలోపేతం అయ్యేనా..?

గ్రామాల్లో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని గ్రామాల నుంచి పాఠశాలలు తగలకుండా ఉండేందుకు ప్రైవేట్ పాఠశాలల వైపు మల్లకుండా చేస్తున్న ప్రయత్నాలు ఆదిలోనే బెడిసికొట్టడం కలకలం రేగింది. ఏకంగా సర్పంచ్ ను బైండోవర్ చేయడాన్ని ఆ మండల సర్పంచుల ఫోరమ్ తీవ్రంగా ఆక్షేపించింది. ఈ అంశం జిల్లాలో తీవ్ర చర్చకు దారి తీయగా తీర్మానాలు అంశం పక్కకు పెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతుందా.. లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇది కూడా చదవండి..: Self Care Day | కాంగ్రెస్​ నాయకుల ఆధ్వర్యంలో ‘స్వీయ సంరక్షణ దినోత్సవం’

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *