అక్షరటుడే, బాన్సువాడ: Banswada MCH Protest | పట్టణంలోని మాతా శిశు ఆసుపత్రి (ఎంసీహెచ్)లో సస్పెండ్ అయిన ఇద్దరు నర్సులకు మద్దతుగా వైద్యులు, పారామెడికల్ సిబ్బంది చేపట్టిన నిరసన రెండో రోజూ కొనసాగింది.
ఆస్పత్రి ఎదుట నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో డాక్టర్లు, వైద్య సిబ్బంది పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్లు శ్రీలత, ప్రకాష్ మాట్లాడుతూ.. బాలింతల కేసు విషయంలో ఇద్దరు నర్సులను సస్పెండ్ చేయడంతో పాటు మత్తు వైద్యుడిని విధుల నుంచి తొలగించడాన్ని తీవ్రంగా ఖండించారు. సిబ్బంది వల్ల ఏదైనా తప్పిదం జరిగితే ముందుగా మెమో జారీ చేసి వివరణ కోరాల్సి ఉంటుందని, నేరుగా సస్పెండ్ చేయడం, విధుల నుంచి తొలగించడం సరైన చర్య కాదని అన్నారు. ఇలాంటి చర్యల వల్ల వైద్య సిబ్బంది మనోధైర్యం దెబ్బతినే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
Banswada MCH Protest | పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి రోగులు..
బాన్సువాడ (Banswada) ఏరియా ఆస్పత్రికి పరిసర మండలాల నుంచి ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో రోగులు వస్తున్నారని, వారికి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు డాక్టర్లతో పాటు వైద్య సిబ్బంది ఎల్లవేళలా సేవలు అందిస్తున్నారని తెలిపారు. ఈ విషయంపై ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు. సస్పెండ్ చేసిన ఇద్దరు నర్సులపై చర్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని, విధుల నుంచి తొలగించిన మత్తు వైద్యుడిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు శ్రీలత, ప్రకాష్, సాయిలు, ప్రవీణ్‌తో పాటు పారామెడికల్ సిబ్బంది హిమాయత్, సాగర్, హెడ్ నర్స్ అమృత తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: CMR Rice Scam | దర్జాగా సీఎంఆర్ మాయం.. మిల్లర్లపై ఆర్ఆర్ యాక్ట్‌కు రంగం సిద్ధం..!