CMR Rice Scam | దర్జాగా సీఎంఆర్​ మాయం.. మిల్లర్లపై చర్యలకు రంగం సిద్ధం!

కొందరు మిల్లర్లు ధాన్యాన్ని పక్కదారి పట్టించారు. అలాంటి వారిపై చర్యలకు అధికారులు సిద్ధం అవుతున్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: CMR Rice Scam | రైతుల వద్ద నుంచి సేకరించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి, పౌరసరఫరాల శాఖకు బియ్యం (Custom Milling Rice – CMR) రూపంలో అప్పగించాల్సి ఉంది. కానీ, జిల్లాలోని కొందరు రైస్ మిల్లర్లు ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని దర్జాగా బ్లాక్ మార్కెట్‌లో విక్రయించుకుంటూ రూ. కోట్లు సొమ్ము చేసుకుంటున్నారు. ఇన్నాళ్లూ రాజకీయ ఒత్తిళ్లు, అధికారుల నిర్లక్ష్యంతో సాగిన ఈ దోపిడీపై ప్రస్తుతం పౌరసరఫరాలు, విజిలెన్స్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. వరుసగా రైస్ మిల్లులపై ఆకస్మిక దాడులు చేస్తూ మిల్లర్ల అక్రమాలను వెలికితీస్తున్నారు.

​CMR Rice Scam | మూడేళ్లుగా అదే తంతు..

​గత నాలుగైదేళ్లుగా సీజన్ల వారీగా ప్రభుత్వం కేటాయించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి సీఎంఆర్ కింద ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాల్సి ఉంది. కానీ, కొందరు అక్రమార్కులు ఆ బియ్యాన్ని బహిరంగ మార్కెట్లో అమ్మేసుకున్నారు. నిబంధనల ప్రకారం ప్రతీ సీజన్ ముగియగానే సీఎంఆర్ లెక్కలు తేల్చి, మిల్లులపై ఒత్తిడి తెచ్చి బియ్యాన్ని రాబట్టాల్సిన పౌరసరఫరాల శాఖ అధికారులు ఇన్నాళ్లూ తీవ్ర నిర్లక్ష్యం వహించారు. దీనికితోడు ప్రజాప్రతినిధుల మద్దతు ఉండటంతో మిల్లర్లు ఆడింది ఆటగా మారింది.

CMR Rice Scam | ​దాడుల్లో బయటపడ్డ విస్తుపోయే నిజాలు

​ఇటీవల సివిల్ సప్లై, విజిలెన్స్ అధికారులు జిల్లాలోని పలు రైస్ మిల్లులపై నిర్వహించిన ఆకస్మిక దాడుల్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. నగర శివారులోని కాలూర్​లో శ్రీ సిద్ధి రామేశ్వర ఆగ్రో ఇండస్ట్రీస్​లో నిర్వహించిన తనిఖీల్లో 2022–23 యాసంగి నుండి 2025–26 రబీ సీజన్ల వరకు ఏకంగా 2,03,688 క్వింటాళ్ల ధాన్యాన్ని పౌరసరఫరాల శాఖకు అందించకుండా మాయం చేసినట్లు తేలింది. సుమారు రూ. 66.12 కోట్ల ప్రజాధనాన్ని స్వాహా చేసినట్లు నిర్ధారించిన అధికారులు, మిల్లు నిర్వాహకుడు శ్రవణ్‌పై కేసు నమోదు చేశారు. బోధన్​ మండలం (Bodhan Mandal) సాలూరలోని ​సాయి లక్ష్మి ఆగ్రో ఇండస్ట్రీస్​లో విజిలెన్స్ అధికారులు జరిపిన దాడిలో ఈ మిల్లుకు కేటాయించిన ధాన్యంలో రూ.4.31 కోట్ల విలువైన 19,631 క్వింటాళ్ల ధాన్యం/బియ్యం ప్రభుత్వానికి ఇవ్వకుండా పక్కదారి పట్టించినట్లు తేలింది. దీంతో ఈ మిల్లుపై కూడా కేసు నమోదు చేశారు.

CMR Rice Scam | ఓ మాజీ ప్రజాప్రతినిధి..

బోధన్ నియోజకవర్గానికి చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి తన బంధువుల పేర్లతో నడుపుతున్న 11 రైస్ మిల్లుల్లో ఇప్పటివరకు రూ.58 కోట్లకు పైగా సీఎంఆర్ పెండింగ్‌లో ఉంది. గతంలో అధికారులు తనిఖీలకు వచ్చినప్పుడల్లా సదరు నేత తన రాజకీయ ప్రభావంతో చర్యలు తీసుకోకుండా మేనేజ్ చేసినట్లు తెలుస్తోంది. ​ప్రతి ఏడాది ప్రభుత్వం నిర్ణీత గడువులోగా సీఎంఆర్ పూర్తి చేయాలని ఆదేశిస్తున్నప్పటికీ, చాలామంది మిల్లర్లు ఆ నిబంధనలను బేఖాతరు చేస్తున్నారు. రాజకీయ నాయకుల ద్వారా అధికారులపై ఒత్తిడి తెచ్చి తనిఖీలు జరగకుండా అడ్డుకునేవారు. అయితే తాజాగా అధికారులు కలెక్టర్​ సూచనల మేరకు డిఫాల్టర్​ రైస్​మిల్లుపై కొరడా ఝులిపిస్తున్నారు. ఇప్పటికైనా రూ.కోట్లల్లో బకాయి పడ్డ రైస్​మిల్లుపై కఠిన చర్యలు తీసుకుంటారా.. లేదా మధ్యలోనే వదిలేస్తారా వేచిచూడాల్సిందే.

CMR Rice Scam | మిల్లర్లపై ఆర్​ఆర్​ యాక్ట్​ ప్రయోగం..!

దీనికి సంబంధించి తాజాగా విజిలెన్స్​ అధికారులు డిఫాల్టర్​ రైల్​మిల్లులపై ఆర్​ఆర్​ చట్టం ప్రయోగించే అవకాశం ఉంది. ఏళ్లుగా దర్జాగా ప్రభుత్వం ధాన్యాన్ని మింగేసి రూ.కోట్లు సంపాదించిన అక్రమార్కులపై చర్యలకు అధికారులు ఉపక్రమిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ చట్టం కింద అవసరమైతే ఆస్తుల జప్తు, బ్యాంకు ఖాతాలపై చర్యలు లేదా ఇతర చట్టపరమైన రికవరీ ప్రక్రియలు చేపట్టే అవకాశం ఉంటుంది. అయితే ఇదంతా ముందే ఊహించిన సదరు రైస్​మిల్లర్లు చట్టంలోని లొసుగులను పసికట్టి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం.

ఇది కూడా చదవండి..: Fee Reimbursement | ఫీజు బకాయిలు విడుదల చేయకపోతే ఉద్యమం మరింత ఉధృతం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *