అక్షరటుడే, భీమ్‌గల్(వేల్పూర్): Farmer Fertilizer Protest | రాష్ట్రంలో రేవంత్ రెడ్డిది ‘తుగ్లక్ పాలన’ అని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Prashanth Reddy) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బాల్కొండ నియోజకవర్గ కేంద్రంలోని ఎన్‌హెచ్–63 వేల్పూర్ క్రాస్ రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు.
Farmer Fertilizer Protest | రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు..
ఈ సందర్భంగా ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశానికి అన్నం పెట్టే రైతన్నలను రోడ్లపైకి లాగిన ఘనత రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రభుత్వానికే దక్కుతుందని మండిపడ్డారు. ‘ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం ఎన్నటికీ బాగుపడదు’ అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ హయాంలో రారాజులా బతికిన రైతు.. నేడు కాంగ్రెస్ పాలనలో కరెంట్, ఎరువుల కోసం రోడ్లెక్కి కొట్లాడాల్సిన దౌర్భాగ్యం దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ కాలంలో ముందస్తుగా ఎరువుల నిల్వలు సిద్ధం చేసేవారమని, కొరత వస్తే తాము ఢిల్లీకి వెళ్లి కేంద్రంతో పోరాడి అదనపు కోటాలు తెచ్చామని గుర్తుచేశారు.
Farmer Fertilizer Protest | కలెక్టర్ లెక్కలపై ప్రశ్నల వర్షం
జిల్లాలో ఎరువుల నిల్వలు పుష్కలంగా ఉన్నాయంటూ అధికారులు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని వేముల విమర్శించారు. జిల్లాలో 3 లక్షల మంది రైతులకు గానూ కేవలం 4 లక్షల యూరియా సంచులు మాత్రమే పంపిణీ చేశారని, అంటే ఒక్కో రైతుకు కనీసం రెండు బస్తాలు కూడా అందలేదని ఎద్దేవా చేశారు. జిల్లాలో 6 లక్షల ఎకరాల సాగు భూమికి గానూ కనీసం 24 లక్షల బస్తాల యూరియా అవసరముండగా.. ఇంకా 20 లక్షల బస్తాల కొరత పెట్టుకుని స్టాక్ ఫుల్‌గా ఉందని ప్రకటించడం బాధ్యతారాహిత్యమన్నారు. చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికే సొసైటీలు డిఫాల్ట్ అయ్యాయంటూ కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, సొసైటీలు లేని ప్రైవేటు దుకాణాల్లో కూడా యూరియా ఎందుకు దొరకడం లేదని ప్రశ్నించారు.
Farmer Fertilizer Protest | కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు
రంగాన్ని అటు కేంద్రంలోని బీజేపీ, ఇటు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు కలిసి దెబ్బతీస్తున్నాయని వేముల ఆరోపించారు. గతంలో రూ.1,200 ఉన్న 20:20 కాంప్లెక్స్ ఎరువుల ధరను రూ. 2,150 కు, రూ. 1,450 ఉన్న జీలుగ ధరను రూ. 2,450కు పెంచి బీజేపీ కేంద్ర ప్రభుత్వం రైతుల నడ్డి విరిచిందని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ.. కేసీఆర్ హయాంలో 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం దానిని 11 గంటలకు తగ్గించిందని, అది కూడా ట్రిప్పుల పేరుతో అరిగోస పెడుతోందని మండిపడ్డారు. రూ. 2 లక్షల రుణమాఫీ, రైతుబంధు (రూ.15,000) హామీలు ఐదు సీజన్లు గడిచినా పూర్తిస్థాయిలో అమలు కాలేదన్నారు. టీవీల్లో ప్రకటనల కోసం రూ. కోట్లల్లో ఖర్చు పెడుతున్న రేవంత్ ప్రభుత్వం.. ఎల్ఐసీకి ప్రీమియం చెల్లించకుండా ‘రైతు బీమా’ పథకాన్ని అటకెక్కించిందని, మరణించిన రైతు కుటుంబాల కన్నీళ్లు తుడువాలనే కనీస బాధ్యత ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు.
Farmer Fertilizer Protest | అదనపు కలెక్టర్ హామీతో ధర్నా విరమణ
ధర్నా తీవ్రరూపం దాల్చడంతో జిల్లా అడిషనల్ కలెక్టర్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నిరసన స్థలానికి చేరుకున్నారు. వారి సమక్షంలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడి రైతాంగం తరపున పలు డిమాండ్లను ముందుంచారు. ఎరువుల కొనుగోలుకు ప్రవేశపెట్టిన ఇబ్బందికరమైన డిజిటల్ ‘యాప్’ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలన్నారు. రైతులకు ఎకరానికి 4 బస్తాల యూరియాను ఎలాంటి ఆంక్షలు లేకుండా ఒకే విడతలో సరఫరా చేయాలని సూచించారు. అన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (సొసైటీలు), ప్రైవేట్ దుకాణాల్లో సరిపడా యూరియా నిల్వలను అందుబాటులో ఉంచాలని కోరారు.
కేంద్ర ప్రభుత్వం పెంచిన కాంప్లెక్స్ ఎరువుల ధరలను తక్షణమే తగ్గించేలా స్థానిక బీజేపీ ఎంపీ చొరవ చూపాలని డిమాండ్ చేశారు. వ్యవసాయానికి గతంలో లాగే నిరంతరాయంగా 24 గంటల విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని కోరారు. వీటిని డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని కలెక్టర్ స్పష్టమైన హామీ ఇవ్వడంతో బీఆర్ఎస్ నాయకులు, రైతులు ధర్నాను విరమించారు. ఈ సమస్యలు తీరకపోతే రాబోయే రోజుల్లో ఏ గ్రామ రైతులు ఆ గ్రామానికి కథానాయకులై కాంగ్రెస్ నాయకులను నిలదీస్తారని వేముల హెచ్చరించారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని టీఆర్ఎస్ మండలాధ్యక్షులు, పలు గ్రామాల బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Kakatiya Engineering Graduates | విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలి: తెయూ రిజిస్ట్రార్