Telegram Dark Web | టెలిగ్రామ్ దేశంలో ‘కొత్త డార్క్ వెబ్’గా మారింది: కేంద్రం

ప్రముఖ మెసేజింగ్ యాప్ 'టెలిగ్రామ్'పై ( Telegram ) కేంద్ర ప్రభుత్వం తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్:Telegram Dark Web | ప్రముఖ మెసేజింగ్ యాప్ ‘టెలిగ్రామ్’పై ( Telegram ) కేంద్ర ప్రభుత్వం తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఇది కేవలం సమాచార మార్పిడి కోసం రూపొందించిన యాప్ కాదని, నేరగాళ్లు, సైబర్ మోసగాళ్లు, తీవ్రవాదులకు ఇది సురక్షితమైన స్థావరంగా మారిందని కేంద్రం ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో సంచలన ఆరోపణలు చేసింది. టెలిగ్రామ్ ప్రస్తుతం దేశంలో ఒక ‘కొత్త డార్క్ వెబ్’లా తయారైందని కేంద్రం పేర్కొంది.

Telegram Dark Web | మ్యూల్ బ్యాంక్ ఖాతాల విక్రయాలు..

నీట్ (NEET) వంటి కీలక పోటీ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ, వాటిని సర్క్యులేట్ చేయడంలో ఈ యాప్ ఛానెళ్లను దుండగులు విచ్చలవిడిగా వాడుకుంటున్నారని కేంద్రం ఆధారాలతో సహా వివరించింది. అంతర్జాతీయ హ్యాకర్లు సైబర్ దాడులకు ప్లాన్ వేయడం, దొంగిలించిన సమాచారాన్ని (Data) ఈ యాప్ ద్వారానే పంచుకుంటున్నారని గుర్తించారు. అక్రమ నగదు లావాదేవీల కోసం ఉపయోగించే ‘మ్యూల్ బ్యాంక్ ఖాతాల’ విక్రయాలు ఈ యాప్‌లో ఓపెన్‌గా జరుగుతున్నాయని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా పిల్లల లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్, చైల్డ్ పోర్నోగ్రఫీ వంటివి టెలిగ్రామ్ క్లోజ్డ్ ఛానెళ్లలో విపరీతంగా వ్యాపిస్తున్నాయని తెలిపింది.

Telegram Dark Web | దర్యాప్తు సంస్థలకు సవాలు..

టెలిగ్రామ్‌లో ఉన్న మితిమీరిన ప్రైవసీ ఫీచర్లు నేరస్తులకు వరంగా మారాయని కేంద్రం వాదించింది. ఫోన్ నంబర్లు, ఐడీలు, ఐపీ అడ్రస్‌లను యూజర్లు సులభంగా దాచుకోగలుగుతుండటంతో, నేరస్తులను పట్టుకోవడం పోలీసులకు, దర్యాప్తు సంస్థలకు తలకు మించిన భారం అవుతోందని స్పష్టం చేసింది. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ డేటా ప్రకారం, టెలిగ్రామ్ ద్వారా జరిగే సైబర్ మోసాల ఫిర్యాదులు ప్రతిరోజూ భారీగా పెరుగుతున్నాయని కోర్టుకు నివేదించింది.

Telegram Dark Web | కోర్టు తీర్పుపై ఉత్కంఠ..

కేంద్ర ప్రభుత్వం లేవనెత్తిన ఈ తీవ్రమైన ఆరోపణలతో టెలిగ్రామ్ యాప్ మనుగడపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రభుత్వం యాప్‌పై నిషేధం విధిస్తుందా లేక కఠినమైన నిబంధనలతో కట్టడి చేస్తుందా అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దేశ భద్రత, పౌరుల ప్రైవసీని దృష్టిలో ఉంచుకుని హైకోర్టు ఎలాంటి కీలక ఆదేశాలు జారీ చేస్తుందో వేచి చూడాలి.

ఇది కూడా చదవండి: Green Tax Rules | గ్రీన్ ట్యాక్స్ అంటే ఏంటి..? ఏ వాహనానికి వర్తిస్తుందంటే?

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *