అక్షరటుడే వెబ్‌డెస్క్: Mohan Bhagwat Gen Z | ముంబయిలో ఆగస్టు 6న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ నిర్వహించనున్న జెన్ జీ (Gen Z), జెన్ ఆల్ఫా విద్యార్థుల ముఖాముఖి కార్యక్రమాన్ని కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్వాగతించారు. ప్రజాస్వామ్యం, దేశ నిర్మాణంపై జరిగే ఈ భేటీలో 100కు పైగా నగరాల నుంచి 15 నుంచి 19 సంవత్సరాల వయసున్న దాదాపు 2,000 మంది విద్యార్థులు పాల్గొననున్నారు. అయితే, 70, 80 ఏళ్ల వయసున్న నాయకులు మాట్లాడటం కంటే, యువతకు ప్రాతినిధ్యం వహించేందుకు యువ నాయకులను రంగంలోకి దింపితే ఈ చర్చలు మరింత అర్థవంతంగా ఉంటాయని దీప్కే అభిప్రాయపడ్డారు. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Mohan Bhagwat Gen Z | దేశ భవిష్యత్తు యువతే..
ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోదీ ( Narendra Modi ) సైతం రాత్రిళ్లు మేల్కొని ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని దీప్కే ఎద్దేవా చేశారు. మోహన్ భగవత్ కూడా జెన్ జీతో మాట్లాడాలనుకోవడం మంచి పరిణామమని, ఆలస్యమైనప్పటికీ యువతను నిర్లక్ష్యం చేయలేమనే వాస్తవాన్ని నాయకులు ఇప్పుడైనా గ్రహించారని ఆయన పేర్కొన్నారు. దేశ భవిష్యత్తు యువతే అయినందున ఇది సానుకూలమే అయినప్పటికీ, జెన్ జీకి అసలు కావాల్సింది యువ నాయకత్వ ప్రాతినిధ్యమేనని ఆయన స్పష్టం చేశారు.
Mohan Bhagwat Gen Z | జార్ఖండ్ విద్యార్థులకు మద్దతు..
మరోవైపు, జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (JPSC) సహా వివిధ నియామక పరీక్షల పేపర్ లీకేజీలపై రాంచీలోని జైపాల్ సింగ్ ముండా స్టేడియంలో నిరసన తెలుపుతున్న విద్యార్థులకు దీప్కే సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులకు కనీసం టెంట్లు వేసుకునేందుకు, మరుగుదొడ్ల వసతులు కల్పించేందుకు కూడా ప్రభుత్వాలు నిరాకరిస్తుండటంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: LIC Share Price | ఎల్ఐసీకి ఏమయ్యింది?.. భారీగా పతనమైన షేరు ధర