అక్షరటుడే వెబ్‌డెస్క్: Tamil Nadu Budget | తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి, స్టార్ హీరో విజయ్ ( Vijay )ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు పెద్దపీట వేస్తూ రాష్ట్ర ఆర్థిక మంత్రి మరియా విల్సన్ ఈ బడ్జెట్‌ను సమర్పించారు. విద్య, యువత సంక్షేమం, మహిళా సాధికారత, మౌలిక సదుపాయాల కల్పనకు ఈ బడ్జెట్‌లో అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు. 2036 నాటికి తమిళనాడును 1.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రకటిస్తూ.. మొత్తం రూ. 4,11,852 కోట్ల భారీ బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రకటించింది.
Tamil Nadu Budget | విద్యా రంగానికి భారీ కేటాయింపులు..
ఈ బడ్జెట్‌లో విద్యారంగానికి పెద్దఎత్తున నిధులు కేటాయించారు. పాఠశాల విద్యాశాఖకు రూ. 44,527 కోట్లు, ఉన్నత విద్యకు రూ. 8,393 కోట్లు కేటాయించారు. ‘వెట్రి మడికణిణి థిట్టం’ ద్వారా కళాశాల విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌ల పంపిణీకి రూ. 2,000 కోట్లు, 11వ తరగతి విద్యార్థులకు ఉచిత సైకిళ్లు, హెల్మెట్లు, వాటర్ బాటిళ్ల కోసం రూ. 277 కోట్లు కేటాయించారు. వీటితో పాటు పాఠశాలల ఆధునీకరణ, కృత్రిమ మేధస్సు (AI), రోబోటిక్స్ శిక్షణకు ప్రత్యేకంగా నిధులు కేటాయించారు.
Tamil Nadu Budget | మహిళా, శిశు సంక్షేమ పథకాలు..
మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం పలు ఆకర్షణీయమైన పథకాలను ప్రకటించింది. అర్హులైన వధువులకు పెళ్లి సమయంలో 1 సవరన్ (8 గ్రాముల) బంగారు నాణెం, పట్టు చీర అందించే పథకానికి రూ. 812 కోట్లు కేటాయించారు. అలాగే ‘తాయ్ మామన్ తంగ మోదిర థిట్టం’ కింద ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించే ప్రతి నవజాత శిశువుకు 1 గ్రాము బంగారు ఉంగరం బహుమతిగా ఇచ్చేందుకు రూ. 560 కోట్లు కేటాయించారు. వీటితో పాటు క్రీడారంగానికి నిధుల పెంపు, రైతుల విద్యుత్ రాయితీలు, కొత్త గృహ నిర్మాణ పథకాలను కూడా ఈ బడ్జెట్‌లో పొందుపరిచారు.
ఇది కూడా చదవండి: Lokayukta Inquiry | బోధన్ శ్మశానవాటిక నిధుల రగడపై ‘లోకాయుక్త’ విచారణ