అక్షరటుడే వెబ్‌డెస్క్: Nepal Landslide Alert | భారీ వరదలతో ఇప్పటికే కోలుకోలేని నష్టాన్ని చవిచూసిన నేపాల్‌ను మరో ప్రమాదం భయపెడుతోంది. దార్చులా జిల్లాలో భారీ కొండచరియలు విరిగిపడటంతో చౌలానీ నది ప్రవాహానికి పాక్షికంగా అడ్డంకి ఏర్పడింది. దీంతో నదికి దిగువన ఉన్న ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు ముంచెత్తే ప్రమాదం ఉందని అధికారులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. గత నెల 26న సంభవించిన భారీ విపత్తు నుండి కోలుకోక ముందే ఈ కొత్త ముప్పు రావడం స్థానికంగా కలవరం రేపుతోంది.
Nepal Landslide Alert | నదికి అడ్డుగా భారీగా శిథిలాలు..
శుక్రవారం అపి హిమాల్ రూరల్ మునిసిపాలిటీ పరిధిలోని భట్టార్ ప్రాంతంలో కొండచరియలు భారీ ఎత్తున కుప్పకూలాయి. పెద్ద మొత్తంలో మట్టి, రాళ్లు, శిథిలాలు నేరుగా నదిలోకి పడిపోవడంతో చౌలానీ (చామేలియా) నది ప్రవాహానికి తీవ్ర అంతరాయం కలిగింది. ఒకవేళ వర్షాలు పడి మరిన్ని కొండచరియలు విరిగిపడితే నది పూర్తిగా మూసుకుపోయే అవకాశం ఉందని జిల్లా యంత్రాంగం ఆందోళన వ్యక్తం చేసింది. అదే జరిగితే నీటి ఒత్తిడి ఒక్కసారిగా పెరిగి ఆ అడ్డంకి తెగిపోతే దిగువ ప్రాంతాలు నీట మునిగే ప్రమాదం ఉంది.
Nepal Landslide Alert | అప్రమత్తమైన యంత్రాంగం..
చౌలానీ నదీ పరివాహక ప్రాంతాలు, దిగువ గ్రామాల్లో నివసించే ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అప్రమత్తం చేసేందుకు భద్రతా బలగాలను రంగంలోకి దించారు. సుదూరపశ్చిమ ప్రావిన్స్ ముఖ్యమంత్రి ఖగరాజ్ భట్టా స్వయంగా అధికారులను అప్రమత్తం చేస్తూ, ఏ క్షణమైనా సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. అత్యవసర సహాయం కోసం ప్రత్యేక నంబర్లను కూడా విడుదల చేశారు.
ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం నదిలో నీటి మట్టం సాధారణంగానే ఉంది. బలాంచ్‌లోని హైడ్రోపవర్ సెక్యూరిటీ బేస్ సిబ్బంది పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. నది ప్రవాహంలో ఏమాత్రం మార్పు వచ్చినా వెంటనే స్థానికులను అప్రమత్తం చేసేలా ఏర్పాట్లు చేశారు. కాగా, అపి హిమాల్ ప్రాంతంలో పుట్టే ఈ నదిని చామేలియా అని కూడా పిలుస్తారు. ఇది చివరకు నేపాల్-భారత్ సరిహద్దుగా ఉన్న మహాకాళీ నదిలో కలుస్తుంది.
Nepal Landslide Alert | 1300 దాటిన మృతులు..
గత నెల 26న నేపాల్‌లో సంభవించిన భీకర ఆకస్మిక వరదలు దేశాన్ని అతలాకుతలం చేశాయి. తాజాగా వెలికితీసిన మృతదేహాలతో కలిపి మొత్తం మృతుల సంఖ్య 1,344కు చేరినట్లు నేపాల్ పోలీసులు శనివారం వెల్లడించారు. వీరిలో 758 మంది పెద్దలు, 85 మంది చిన్నారులు ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటికే వేలాది మంది నిరాశ్రయులు కాగా, ఇళ్లు, రోడ్లు, వంతెనలు ధ్వసమై మౌలిక వసతులు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ దుస్థితిలో ఇప్పుడు తాజాగా కొండచరియల ముప్పు ముంచుకురావడంతో నేపాల్ ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.
A reminder that mountains have no borders.
A landslide was reported near Bhattad in Api Himal, Darchula, Nepal, today. Nearby riverside villages are advised to stay alert.
Sharing this as Nepal’s hills face another weather-related concern. 🙌🏼 pic.twitter.com/9fWmcHh6ra
— The Modern Himachal (@themodernhp) September 4, 2026
ఇది కూడా చదవండి: CM Revanth Reddy | రెండేళ్లలో టీచర్ల సమస్యలు పరిష్కరిస్తాం : సీఎం రేవంత్‌రెడ్డి