UPI Charges | యూపీఐ డిజిటల్ చెల్లింపుల ఖర్చు భరించాల్సిందే: ఆర్‌బీఐ గవర్నర్

యూపీఐ లావాదేవీలపై ఛార్జీల అంశంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పందించారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: UPI Charges | యూపీఐ లావాదేవీలపై ఛార్జీల అంశంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ సంజయ్ మల్హోత్రా ( Sanjay Malhotra )స్పందించారు. డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను బలోపేతం చేయడానికి అయ్యే ఖర్చును ఎవరో ఒకరు భరించాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. యూపీఐ ఛార్జీలపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కోసం వేచి చూడాలని, దీనిపై ఇప్పుడే మాట్లాడడం తొందరపాటే అవుతుందని తెలిపారు.

UPI Charges | ఎండీఆర్ ఛార్జీల ప్రతిపాదన..

యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) ఛార్జీలు విధించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ‘ద పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ యాక్ట్’లో సవరణలను ప్రతిపాదించారు. ఈ సవరణల ద్వారా యూపీఐ చెల్లింపులపై ఎండీఆర్ విధించేందుకు మార్గం సుగమం కానుంది. అయితే, ఈ ఛార్జీలు సాధారణ వినియోగదారులకు, చిన్న వ్యాపారులకు వర్తించవని.. కేవలం పెద్ద వ్యాపారులకు మాత్రమే వర్తించే అవకాశం ఉందని భావిస్తున్నారు. రూ.2 వేలకు మించిన లావాదేవీలపై 0.3% నుంచి 0.5% వరకు ఎండీఆర్ ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఈ నిర్వహణ ఖర్చులను బ్యాంకులు, పేమెంట్ కంపెనీలే భరిస్తున్నాయి.

UPI Charges | వచ్చే ఏడాది నుంచి పాలిమర్ కరెన్సీ..

దీర్ఘకాలం పాటు మన్నికగా ఉండే పాలిమర్ కరెన్సీ నోట్లను వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం నాటికి అందుబాటులోకి తీసుకురావాలని ఆర్‌బీఐ లక్ష్యంగా పెట్టుకున్నట్లు గవర్నర్ తెలిపారు. కొన్ని దేశాల్లో ఈ పాలిమర్ నోట్లు 30 ఏళ్లకు పైగా మన్నికగా నిలిచాయని ఆయన గుర్తుచేశారు. ముఖ్యంగా ఎక్కువగా చెలామణిలో ఉండే తక్కువ విలువ కలిగిన నోట్లకు ఈ పాలిమర్ నోట్లు ఎంతగానో ఉపయుక్తంగా ఉంటాయని స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి:  Rahul Gandhi on Modi | మోదీ, అమిత్​ షాకు ధైర్యం లేదు : రాహుల్ గాంధీ

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *