Indigenous MRI Machine | భారత్ వైద్య రంగంలో అద్భుతం.. అత్యంత తక్కువ ఖర్చుతో స్వదేశీ ఎంఆర్ఐ మెషిన్!

భారతదేశంలో రోజురోజుకూ పెరుగుతున్న వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించే దిశగా వైద్య సాంకేతిక రంగంలో ఒక మైలురాయి నమోదైంది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Indigenous MRI Machine | భారతదేశంలో ( India )రోజురోజుకూ పెరుగుతున్న వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించే దిశగా వైద్య సాంకేతిక రంగంలో ఒక మైలురాయి నమోదైంది. విదేశీ కంపెనీల గుత్తాధిపత్యానికి తెరదించుతూ, దేశంలోనే అత్యంత తక్కువ ఖర్చుతో కూడిన మొదటి పూర్తి స్వదేశీ ఎంఆర్ఐ (MRI) స్కాన్ మెషిన్‌ను ‘Voxelgrids’ అనే స్టార్టప్ అందుబాటులోకి తెచ్చింది. న్యూయార్క్‌లోని జీఈ (GE) కార్పొరేట్ సంస్థలో భారీ జీతంతో పనిచేస్తున్న భారతీయ ఇంజినీర్ డాక్టర్ అర్జున్ అరుణాచలం.. దేశీయ అవసరాలకు తగ్గట్టుగా వైద్య పరికరాలను అందించాలనే లక్ష్యంతో తన ఉద్యోగాన్ని వదిలి భారత్‌కు తిరిగి వచ్చారు. దాదాపు 12 సంవత్సరాల పాటు నిరంతర పరిశోధనలు చేసి, పూర్తిగా భారత్‌లోనే ఈ మెషీన్‌ను తయారు చేశారు.

Indigenous MRI Machine | మెషిన్ ప్రత్యేకతలు..

సాధారణంగా వాడే ఎంఆర్ఐ మెషిన్లు 5 టన్నుల బరువు ఉండి, చల్లబరచడానికి ఖరీదైన లిక్విడ్ హీలియంను ఉపయోగిస్తాయి. కానీ ఈ స్వదేశీ పరికరానికి లిక్విడ్ హీలియం అవసరం లేదు. పైగా బరువు కూడా సగానికి తగ్గడం వల్ల చిన్న క్లినిక్స్‌లోనూ దీనిని సులభంగా ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ కొత్త మెషిన్ వినియోగంలోకి వస్తే రోగులకు ఎంఆర్ఐ స్కాన్ ఖర్చులు ఏకంగా 60% వరకు తగ్గే అవకాశం ఉంది. ఈ టెక్నాలజీని కొనుగోలు చేసేందుకు అనేక అంతర్జాతీయ బహుళ జాతీయ కంపెనీలు ప్రయత్నించినప్పటికీ, డాక్టర్ అర్జున్ వాటి ప్రతిపాదనలను తిరస్కరించారు.

Indigenous MRI Machine | భవిష్యత్తు ప్రణాళికలు..

ఈ ప్రాజెక్టుకు టాటా ట్రస్ట్స్‌తో పాటు జోహో (Zoho) సంస్థ అధినేత శ్రీధర్ వేంబు రూ.35 కోట్ల పెట్టుబడితో మద్దతుగా నిలిచారు. ప్రస్తుతం మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ సమీపంలో ఉన్న ఒక క్యాన్సర్ కేర్ సెంటర్‌లో ఈ స్వదేశీ ఎంఆర్ఐ మెషిన్ విజయవంతంగా సేవలు అందిస్తోంది. త్వరలోనే దీని ఉత్పత్తిని పెంచి, దేశవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రులకు అందుబాటులోకి తీసుకురావడానికి నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి:Jharkhand Student Protest | జార్ఖండ్​లో విద్యార్థుల ఆందోళన.. పత్తా లేని కాంగ్రెస్​

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *