అక్షరటుడే వెబ్డెస్క్: Parliament Deadlock | విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యాల ఆరోపణలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పార్లమెంట్లో ప్రకటన చేసే వరకు ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య డెడ్లాక్ వీడదని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా ( Priyanka Gandhi )స్పష్టం చేశారు. హోంశాఖ మంత్రి స్వయంగా ప్రకటన చేస్తేనే సభ సజావుగా సాగుతుందని ఆమె తేల్చి చెప్పారు.
Parliament Deadlock | కీలక బిల్లుల భవితవ్యం అనిశ్చితిలో..
వర్షాకాల సమావేశాలు ముగియడానికి కేవలం నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ తరుణంలో తీవ్ర నిరసనల నడుమ మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్), విదేశీ నిధుల క్రమబద్ధీకరణ సవరణ చట్టం (FCRA) వంటి కీలక బిల్లుల భవితవ్యం అనిశ్చితిలో పడింది. సోమవారం లోక్సభ అజెండా జాబితాలో కూడా ఈ బిల్లులకు చోటు దక్కలేదు. ప్రభుత్వం జరిపిన చర్చల తర్వాత మహిళా కోటా, డీలిమిటేషన్ బిల్లులపై కొన్ని ప్రతిపక్షాలు కొంత మెత్తబడినప్పటికీ.. కాంగ్రెస్ , దాని మిత్రపక్షాలు మాత్రం ఎఫ్సిఆర్ఎ (FCRA) సవరణ బిల్లుతో సహా ఇతర బిల్లులను గట్టిగా అడ్డుకోవాలని నిర్ణయించాయి.
Parliament Deadlock | ఎఫ్సిఆర్ఎ బిల్లుపై తీవ్ర వ్యతిరేకత..
ఎన్జీఓలు, మైనారిటీ సంస్థలను లక్ష్యంగా చేసుకుని తెస్తున్న ఎఫ్సిఆర్ఎ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని, ప్రజా వ్యతిరేకమని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ విమర్శించారు. ఒకవేళ కేంద్రం బలవంతంగా ఈ బిల్లును ఆమోదింపజేయాలని చూస్తే పార్లమెంట్లో తీవ్ర నిరసనలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. విదేశీ నిధులు పొందే సంస్థలపై కఠిన ఆంక్షలు విధించేలా రూపుదిద్దుకున్న ఈ బిల్లును పలు క్రైస్తవ సంస్థలు, రాజకీయ పక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
Parliament Deadlock | వర్షాకాల సమావేశాల తీరు..
గత జులై 20న ప్రారంభమైన ఈ వర్షాకాల సమావేశాలు ప్రతిపక్షాల వరుస నిరసనలు, వాయిదాల నడుమ దాదాపు స్తంభించిపోయాయి. పోటీ పరీక్షల అక్రమాల నిరోధక సవరణ బిల్లు-2026తో పాటు కొన్ని చిన్న బిల్లులు మాత్రమే ఎలాంటి చర్చ లేకుండా ఆమోదం పొందాయి.
ఇది కూడా చదవండి: Sriramsagar Water Storage | ఎస్సారెస్పీకి తగ్గుతున్న వరద.. 42.116 టీఎంసీలకు చేరిన నీటి నిల్వ