అక్షరటుడే, వెబ్‌డెస్క్: Jharkhand Assembly Protest | జార్ఖండ్‌లో విద్యార్థుల ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు, నిరుద్యోగులు సోమవారం అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. వేలాది మంది విద్యార్థులు తరలి వచ్చారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. బారికేడ్లు అడ్డుపెట్టారు. ఈ క్రమంలో విద్యార్థులు బారికేడ్లను తోసుకుంటూ వెళ్లడానికి యత్నించగా.. పోలీసులు లాఠీఛార్జి చేశారు. విద్యార్థులపై వాటర్ కేనాన్లు ప్రయోగించారు
జార్ఖండ్ జీపీఎస్సీ–జేఎస్ఎస్సీ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని విద్యార్థులు, నిరుద్యోగులు కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఆందోళనల్లో భాగంగా సోమవారం అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి వేలాదిగా యువత తరలి వచ్చారు. విద్యార్థి నాయకుడు దేవేంద్ర నాథ్ మహతో (Devendra Nath Mahato) మాట్లాడుతూ.. నిరాహార దీక్షలో ఉన్నప్పటికీ తాను ఇక్కడికి వచ్చానని తెలిపారు. వారు తమను అడ్డుకోలేరన్నారు. ‘‘నేను అంబులెన్స్‌లో ఇక్కడికి చేరుకున్నాను, ఇప్పుడు స్ట్రెచర్‌పై ముందుకు సాగుతున్నాను. గత 9 రోజులుగా నేను నిరాహార దీక్ష చేస్తున్నాను, ప్రభుత్వం మా డిమాండ్లను అంగీకరించక తప్పదు.” అన్నారు.
Jharkhand Assembly Protest | అడ్డుకున్న పోలీసులు
విద్యార్థులు పోలీసుల బారికేడ్ల వద్దకు చేరుకున్నారు. అక్కడ పోలీసులు విద్యార్థులను అడ్డుకున్నారు. దీంతో వారు బారికేడ్లపైకి ఎక్కి నిరసన తెలిపారు. ఈ క్రమంలో తోపులాట చోటు చేసుకుంది. విద్యార్థులు మాట్లాడుతూ.. తాము శాంతియుతంగా విధానసభ వైపు వెళ్తుంటే పోలీసులు అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చేవరకు ఆందోళనలు విరమించే ప్రసక్తే లేదని తెలిపారు. పరీక్షను రద్దు చేయాలని, దీనిపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
Jharkhand Assembly Protest | ఎక్కడికక్కడ తనిఖీలు
అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో జార్ఖండ్ పోలీసులు ఎక్కడికక్కడ విద్యార్థులను అడ్డుకున్నారు. రాంచీకి వచ్చే మార్గాల్లో తనిఖీలు చేశారు. బస్సులను ఆపి వేశారు. విద్యార్థులు ఇక్కడికి చేరుకోకుండా ఉండేందుకు బైక్‌లను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేశారు. రాంచీలో పోలీసులు లాఠీఛార్జ్ చేసి, వాటర్ కెనాన్లను ఉపయోగించారు. దేశంలోని అన్ని సమస్యలను లాఠీలతో కాకుండా చర్చలతోనే పరిష్కరించగలమని ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ చెప్పినప్పటికీ ఈ ఘటన చోటుచేసుకుంది. విద్యార్థి నాయకుడు దేవేంద్ర మహతో, పోలీసులు అడ్డుకుంటే వారితో వాదించవద్దని, క్రమశిక్షణతో అసెంబ్లీకి చేరుకోవడానికి కొత్త మార్గాలను వెతుక్కోవాలని నిరసనకారులకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రదర్శనలో పాల్గొనేందుకు వేలాది మంది విద్యార్థులు ఈ ఉదయం పలు జిల్లాల నుంచి రైళ్లు, బస్సులు, ఇతర వాహనాల్లో భారీ సంఖ్యలో రాష్ట్ర రాజధానికి చేరుకున్నారు.
Jharkhand Assembly Protest | బీజేపీ నిరసన
ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నివాసం ఎదుట బీజేపీ నాయకులు నిరసన తెలుపుతున్నారు. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించిన నియామక పరీక్షలలో పేపర్ లీక్‌లు జరగడం ఈ నిరసనకు ప్రధాన కారణాలలో ఒకటి. అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలని విద్యార్థులు పట్టుబట్టడంతో, నిన్న జరిగిన ఆరో దఫా చర్చలు కూడా ఎలాంటి పరిష్కారాన్ని ఇవ్వలేదు. వారి డిమాండ్లలో 98 శాతం అంగీకరించామని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.
ఇది కూడా చదవండి..: Tribunals Reforms Bill | లోక్‌సభ లో ట్రిబ్యునల్స్ సంస్కరణల బిల్లు ఆమోదం