అక్షరటుడే, వెబ్‌డెస్క్: Kalvakuntla Kavitha | రాష్ట్రంలోని ఆదివాసీ ప్రాంతాల్లో పౌష్టికాహారం, రక్షిత తాగునీరు, సాగునీరు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఆదివాసీల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వాలు మరింత చిత్తశుద్ధితో పనిచేయాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు.
హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో మంగళవారం కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన పలువురు ఆదివాసీ నాయకులు, తెలంగాణ ఆదివాసీ టైగర్ సేన నాయకులు తెలంగాణ రక్షణ సేనలో చేరారు. కోట్నక కిషన్ రావు, పెందోర్ ధర్ము, పెందోర్ దౌలత్ రావు తదితరులకు కవిత పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
Kalvakuntla Kavitha | కొమరం భీమ్ వర్ధంతి నాటికి డబుల్ రోడ్డు
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ఆదివాసీల ఆరాధ్య దైవం కొమరం భీమ్ వర్ధంతి నాటికి కెరమెరి నుంచి జోడేఘాట్ వరకు డబుల్ రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కొమరం భీమ్ స్ఫూర్తికి ప్రతీకగా ఉన్న జోడేఘాట్ ప్రాంతానికి మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
Kalvakuntla Kavitha | 60 వేల ఎకరాలకు సాగునీరు అందించాలి
అడ ప్రాజెక్టు, ఎన్టీఆర్ సాగర్ ప్రాజెక్టుల కాల్వలను ఆధునికీకరించి వాటి ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించాలని కవిత కోరారు. ఈ రెండు ప్రాజెక్టుల పరిధిలోని సుమారు 60 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అదేవిధంగా పోడు భూముల సమస్యను పరిష్కరించాలని, గతంలో ప్రభుత్వం మంజూరు చేసిన హక్కు పత్రాలకు సంబంధించిన భూములను వెంటనే ఆదివాసీలకు అప్పగించాలని కోరారు. ఇందుకోసం అటవీ, రెవెన్యూ శాఖల అధికారులతో సంయుక్త సర్వే నిర్వహించాలని సూచించారు.
Kalvakuntla Kavitha | ‘ఐటీడీఏలు నామ్‌కే వాస్తేగా మారాయి’
ఆదివాసీల సంక్షేమం, అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ఐటీడీఏలు ప్రస్తుతం ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదని కవిత విమర్శించారు. ఆదివాసీలకు అండగా నిలవాల్సిన వ్యవస్థలు నామ్‌కే వాస్తేగా మారడం దురదృష్టకరమన్నారు.
ఆదివాసీ నాయకుడు సోయం బోజారావు గుట్టబండపై మట్టి పోసి పంటలు సాగు చేయాల్సిన పరిస్థితి ఏర్పడటం అక్కడి ప్రజల దుర్భర జీవన పరిస్థితులకు అద్దం పడుతోందని పేర్కొన్నారు. ఆదివాసీల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Kalvakuntla Kavitha | ఆదివాసీ ప్రాంతాల్లో పర్యటనకు కవిత హామీ
ఆదివాసీ సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు త్వరలోనే ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తామని కవిత తెలిపారు. ఆదివాసీల హక్కులు, సంక్షేమం కోసం తమ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఆదివాసీ నాయకుల చేరికతో తెలంగాణ రక్షణ సేనకు కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో రాజకీయంగా మరింత బలం చేకూరుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కార్యక్రమంలో మాజీ మంత్రి బోడ జనార్దన్, సిర్పూర్ నియోజకవర్గ ఇన్చార్జి కావేటి సబిత తదితరులు పాల్గొన్నారు.