అక్షరటుడే, వెబ్డెస్క్: Godavari Pushkaralu 2027 | గోదావరి తీరాలు మరోసారి ఆధ్యాత్మిక శోభతో పులకించనున్నాయి. పుణ్యస్నానాలకు, భక్తి విశ్వాసాలకు ప్రతీకగా నిలిచే 2027 గోదావరి మహా పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. పుష్కరాల ఏర్పాట్లలో భాగంగా ‘అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్ట్’ కింద ప్రభుత్వం రూ.210 కోట్లు మంజూరు చేసింది.
పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే పుష్కర మహోత్సవం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందించడంతో పాటు గోదావరి తీర ప్రాంతాల పర్యాటక ప్రాధాన్యాన్ని మరింత పెంచేలా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
Godavari Pushkaralu 2027 | 238 పుష్కర ఘాట్లకు కొత్త రూపు
పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. మంజూరైన నిధులతో ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని 238 పాత, కొత్త పుష్కర ఘాట్లను అభివృద్ధి చేయనున్నారు.
భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించడంతో పాటు ఘాట్ల వద్ద మౌలిక వసతులను మెరుగుపరచనున్నారు. నదీ తీరాలను సుందరంగా తీర్చిదిద్దుతూ భక్తులకు ఆహ్లాదకరమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
Godavari Pushkaralu 2027 | మహాకుంభమేళా తరహాలో పుష్కరాలు
ప్రయాగ్రాజ్లో జరిగిన మహాకుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలను నిర్వహించాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున పుష్కర ప్రాంతాల్లో విస్తృత ఏర్పాట్లు చేయాలని భావిస్తోంది.
గోదావరి నదీ River తీరాన్ని కేవలం పుణ్యస్నానాల ప్రదేశంగానే కాకుండా, ఆధ్యాత్మికత, సంస్కృతి, సంప్రదాయం, పర్యాటకం కలగలిసిన మహా వేదికగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
Godavari Pushkaralu 2027 | గోదావరి తీరంలో ఆధ్యాత్మిక వైభవం
తెలుగు ప్రజల జీవనంతో గోదావరి నదికి విడదీయరాని అనుబంధం ఉంది. గోదావరి ప్రవాహం వెంట విరాజిల్లే ఆలయాలు, పుణ్యక్షేత్రాలు, ప్రాచీన సంప్రదాయాలు ఈ నదికి ప్రత్యేక ఆధ్యాత్మిక గుర్తింపును తీసుకొచ్చాయి.
పుష్కర సమయంలో గోదావరిలో పుణ్యస్నానం ఆచరించడం అత్యంత పవిత్రమైన కార్యంగా భక్తులు భావిస్తారు. నదీమాతకు నమస్కరించి, పుణ్యస్నానం చేసి, దైవదర్శనం చేసుకునేందుకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు.
2027 పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ఘాట్ల అభివృద్ధి, నదీ తీరాల సుందరీకరణ, భక్తులకు అవసరమైన సౌకర్యాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది.
Godavari Pushkaralu 2027 | భక్తులకు ఆహ్లాదం.. ప్రాంతానికి పర్యాటక కళ
రూ.210 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులు పూర్తయితే గోదావరి తీర ప్రాంతాలకు కొత్త రూపు రానుంది. పుష్కరాలకు వచ్చే భక్తులకు సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు గోదావరి జిల్లాల్లో ఆధ్యాత్మిక పర్యాటకానికి కూడా మరింత ఊతం లభించే అవకాశం ఉంది.
పుష్కర జలాల్లో పుణ్యస్నానం.. గోదావరి తీరంలో ఆధ్యాత్మిక సందడి.. ఘాట్లపై భక్తుల కోలాహలం.. ఇలా 2027లో గోదావరి మహా పుష్కరాలు ఆంధ్రప్రదేశ్లో భక్తి, సంస్కృతి, సంప్రదాయాల మహోత్సవంగా నిలిచేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.